ఏసీబీ కార్యాలయానికి అదనపు కలెక్టర్ తరలింపు‌

రైతు నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేసి అరెస్టయిన మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను అనిశా అధికారులు బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు.

Published : 10 Sep 2020 15:45 IST

హైదరాబాద్‌: రైతు నుంచి భారీగా లంచం డిమాండ్‌ చేసి అరెస్టయిన మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను అనిశా అధికారులు బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు. మాచవరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బుధవారం ఉదయం నుంచి ఆయన కార్యాలయం, ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లిలోని నగేశ్‌ నివాసంలో లాకర్‌ కీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

భారీగా లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారంలో నగేశ్‌తో పాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీమ్‌ అహ్మద్‌, నగేశ్‌ బినామీ జీవన్‌గౌడ్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నగేశ్‌ మినహా మిగిలిన వారందరినీ నర్సాపూర్‌ నుంచి అర్ధరాత్రి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. నగేశ్‌ ఇంట్లో పూర్తిగా సోదాలు నిర్వహించిన అధికారులు అతన్ని ఇవాళ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ కేసులో ఇతర ఉన్నతాధికారుల పాత్రపైనా నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు నిందితులకు మరి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అనిశా న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు.

ఇవీ చదవండి..
రూ.1.12 కోట్ల లంచం... అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌

మెదక్‌ అదనపు కలెక్టర్‌ అరెస్ట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని