France: తల్లి నిద్రపోతోందనుకొని.. మృతదేహంతో రోజులకొద్దీ గడిపిన చిన్నారులు

అభంశుభం తెలియని ఆ చిన్నారులకు ఏం తెలుసు తమ తల్లి చనిపోయిందని.. ఆ పాలుగారే బుగ్గలకు ఏం తెలుసు తమ మాతృమూర్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని.....

Updated : 03 Oct 2021 01:25 IST

రెన్నాస్‌: అభంశుభం తెలియని ఆ చిన్నారులకు ఏం తెలుసు తమ తల్లి చనిపోయిందని.. ఆ పాలుగారే బుగ్గలకు ఏం తెలుసు తమ మాతృమూర్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని.. నిద్రపోతోందని భావించారు. తిరిగి తమను ఒడిలోకి తీసుకొని లాలిస్తుందని ఆశించారు. అలా గంటలు కాదు.. రోజులపాటు వేచిచూశారు. ఈ హృదయవిదారక ఘటన ప్రాన్స్‌లో చోటు చేసుకుంది. అనుకోని కారణాలతో మరణించిన తల్లి మృతదేహం వద్దే ఆ చిన్నారులు రోజుల కొద్దీ గడిపారు. నిద్రపోతోందని భావించారు. అల్లరిచేస్తే ఆమెకు ఎక్కడ మెలుకువ వస్తుందోనని నిశ్శబ్దంగానే ఉన్నారు.

వాయువ్య ఫ్రాన్స్‌లోని లేమాన్స్‌ పట్టణానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు సంతానంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం అకస్మాత్తుగా మృతిచెందారు. అయితే ఆమె ఐదు, ఏడేళ్ల కుమార్తెలు మాత్రం తల్లి మరణించినట్లు తెలుసుకోలేకపోయారు. ఆమె నిద్రపోతోందని భావించారు. అయితే కొద్దిరోజులుగా సదరు బాలికలు పాఠశాలకు వెళ్లకపోవడంతో వారి తల్లికి సమాచారం అందించేందుకు ప్రయత్నించారు. స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం పోలీసులు వారి ఇంటికి వెళ్లి తలుపు తట్టగా బయటకు వచ్చిన చిన్నారులు ‘నిశ్శబ్దంగా ఉండండి. మమ్మీ నిద్రపోతోంది’ అని పోలీసులతో అనడం గమనార్హం. లోపలికి వెళ్లి చూడగా మహిళ మృతిచెంది దుర్వాసన వస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆమెది సహజ మరణంగానే తేలినట్లు వెల్లడించారు. బాలికలను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారికి కౌన్సెలింగ్‌ అందిస్తున్నారు. అయితే ఆ మహిళ మృతిచెంది ఎన్న రోజులు అవుతుందో స్పష్టంగా తెలియలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని