Women’s Safety:మహిళల భద్రత కోసం నిర్భయ స్క్వాడ్‌లు.. ప్రభుత్వంపై నెటిజన్ల ప్రశంసలు

ముంబయి నగరంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, ఇతర నేరాలను

Published : 27 Jan 2022 23:53 IST


ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి నగరంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్‌టీజింగ్‌, లైంగిక వేధింపులు, ఇతర నేరాలను నిరోధించడానికి మహిళా అధికారులతో కూడిన నిర్భయ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబయిలో 91 నిర్భయ స్క్వాడ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిచారు. ఈ బృందాల్లో ఉన్న అధికారులు ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఈ బృందాలను నగరమంతటా మోహరించారు.  ఆపదలో ఉన్న మహిళలు 103 అనే హెల్ప్‌లైన్‌ నంబర్‌కి కాల్‌ చేస్తే  నిర్భయ స్క్వాడ్‌ వెంటనే అక్కడి చేరుకుని కాపాడుతుంది. అనంతరం వేధింపులకు గురిచేసిన వారిని అరెస్ట్‌ చేస్తుంది. ప్రతి పోలీసు స్టేషన్‌లో నిర్భయ స్క్వాడ్‌ని ఏర్పాటు చేశారు.

ప్రతి స్క్వాడ్‌లో ఒక మహిళా అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ లేదా సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక మహిళా కానిస్టేబుల్, ఒక పురుష కానిస్టేబుల్‌తో పాటు డ్రైవర్ ఉంటారు. ఈ బృందం పెట్రోలింగ్‌ చేసేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో ‘మొబైల్ 5’ వాహనాన్ని కేటాయించారు. నిర్భయ స్క్వాడ్‌లు ఎలా పనిచేస్తాయో తెలియజేసేందుకు ముంబయి పోలీసులు ఓ షార్ట్‌ఫిల్మ్‌ని రూపొందించారు. దీనికి రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించగా.. అమితాబ్‌ బచ్చన్‌ గాత్రదానం చేశారు. ఈ వీడియోని ముంబయి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. మహిళల భద్రత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి పోలీసులు చూపుతున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి బృందాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 76లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని