డ్రోన్ల ప్రదర్శనతో 2020కి వీడ్కోలు

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2020కి వీడ్కోలు పలుకుతూ నిర్వహించిన డ్రోన్ల విన్యాసాలు కట్టిపడేశాయి.

Published : 31 Dec 2020 21:06 IST

ఎడిన్‌బర్గ్‌: స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2020కి వీడ్కోలు పలుకుతూ నిర్వహించిన డ్రోన్ల విన్యాసాలు కట్టిపడేశాయి. వందలాది డ్రోన్లతో గగన తలంలో వైవిధ్యమైన ఆకృతులను ఏర్పాటు చేస్తూ నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఏటా కొత్త ఏడాదికి ముందు నిర్వహించే హోగ్‌మనే వేడుకలు ఈసారి కరోనా మహమ్మారి వల్ల ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఏటా మూడు రోజుల పాటు జరిగే నూతన సంవత్సర స్వాగత వేడుకలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. కరోనా కారణంగా ఈసారి వేడుకలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఎడిన్‌బర్గ్‌ ప్రాంతంలో నిర్వహిస్తున్న డ్రోన్‌ ప్రదర్శనలు వీనులకు విందు చేస్తున్నాయి. కృత్రిమ మేధతో నిర్మించిన 150 డ్రోన్లు గంటకు 25మైళ్ల వేగంతో కదులుతూ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

 

మిరుమిట్లు కొలిపే వెలుగులతో జంతువులు, జలచరాలు సహా వివిధ క్రమ పద్ధతులతో డ్రోన్లను అమర్చిన తీరు ఆకట్టుకుంటోంది. యూకేలో ఇప్పటి వరకు జరిగిన డ్రోన్ల ప్రదర్శనల్లో ఇదే పెద్దది. వివిధ రంగులను వెదజల్లే టార్చ్‌లను డ్రోన్లకు అమర్చడం వల్ల ప్రదర్శన మరింత ఆకర్షణీయంగా మారింది. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఈ ప్రదర్శనను అంకితం చేశారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రితో ఈ హోగ్‌మనే పండుగ ముగుస్తుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని