Updated : 06/03/2021 17:49 IST

నడవలేని స్థితి నుంచి.. ర్యాంప్‌పై నడక!

అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే బరువు తగ్గడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి ముంబయికి చెందిన దినేశ్‌ మోహన్‌ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. మధ్య వయసులో భారీకాయంతో బాధపడి, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన అతడు.. వృద్ధాప్యంలో ర్యాంప్‌ వాక్‌ చేస్తూ సూపర్‌ మోడల్‌గా ఎదిగాడు. యువ మోడళ్లకు పోటీనిస్తూ ఫ్యాషన్‌ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు.

దినేశ్‌ మోహన్‌ జీవితం ఒకప్పుడు సాదాసీదాగా ఉండేది. 44 ఏళ్ల వయసులో జీవితం పట్ల అతడికి విరక్తి పుట్టింది. ఉద్యోగం వదులుకోని సోదరి ఇంట్లో ఉండేవాడు. ఏ పని చేయకుండా తిని, పడుకోవడమే అతడి దిన చర్య. ఈ క్రమంలో దినేశ్‌ శరీర బరువు 130కిలోలకు పెరిగింది. దీంతో మంచం నుంచి లేచి నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు అతడిని చుట్టుముట్టేవి. ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలతో మరింత కుంగిపోయాడు. ఇదంతా చూసిన అతడి సోదరి మందలించింది. ఇలా మంచంలోనే పడుకొని ఏం సాధిస్తావు?నీ పుట్టుకకు ఒక అర్థం ఉండాలి కదా! అని హితబోధ చేసింది. దీంతో దినేశ్‌కు జీవితం పట్ల ఆశలు చిగురించాయి. అలా బాహ్య ప్రపంచంలోని మళ్లీ అడుగుపెట్టాడు. మొదట బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకొని కొన్ని నెలలపాటు కష్టపడ్డాడు. దీంతో 50 కిలోల బరువు తగ్గి గుర్తించలేని విధంగా మారిపోయాడు. ఆ మార్పు అతడిని సెలబ్రిటీగా మార్చేంతలా ఉంటుందని బహుశా దినేశ్‌ కూడా ఊహించి ఉండడు. ఓ రోజు ఫ్యాషన్‌ మ్యాగజైన్‌‌ కోసం పనిచేసే ఓ వ్యక్తి దినేశ్‌ను చూసి విస్తుపోయాడు. వెంటనే కెమెరాలో అతడిని ఫొటోలు తీసి.. భారీకాయంతో ఉన్నప్పటి ఫొటో, బరువు తగ్గిన తర్వాత తను తీసిన ఫొటోను మ్యాగజైన్‌లో వేయించాడు. అప్పుడు దినేశ్‌ వయసు 50ఏళ్లు.

జీవితాన్ని మార్చేసిన  ఫొటోలు

దినేశ్‌ ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మోడలింగ్‌ చేయాలంటూ పలు మోడలింగ్‌ ఏజెన్సీల నుంచి అతడికి ఫోన్లు వచ్చాయి. దీంతో తన గమ్యం మోడలింగ్‌ అనుకొని అటుగా ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట్లో పలు మోడలింగ్‌ సంస్థల్లో ఆడిషన్స్‌కు వెళ్లిన దినేశ్.. తక్కువ కాలంలోనే ఫేమస్‌ మోడల్‌గా మారిపోయాడు. వందలకొద్ది ఫ్యాషన్‌ షోలు, లెక్కలేనన్ని ఫొటోషూట్స్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం 62ఏళ్ల వయసులోనూ ఫ్యాషన్‌ ఐకాన్‌గా వెలుగొందుతూ ఆకట్టుకుంటున్నాడు. స్టైలీష్‌ జుట్టు, గడ్డంతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. మోడల్‌గానే కాదు.. పలు సినిమాల్లోనూ మెరిశాడు. ఇటీవల దినేశ్‌ ‘ముంబయి ఆఫ్‌ హ్యూమన్స్‌’తో ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు. జీవితంలో ఏది సాధించలేకపోతున్నామని బాధపడే వారికి తన జీవితం స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జీవితంలో గొప్ప మార్పులు ఏ క్షణంలోనైనా జరగొచ్చనే విషయాన్ని నమ్మాలని చెప్పాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని