Published : 30/09/2020 01:44 IST

వీడియో గేమ్స్‌ ఆడటం మంచిదే..కానీ!

 

‘మా అబ్బాయి ఎంత చెప్పినా వినడు. ఎప్పుడూ కంప్యూటర్‌ ముందు కూర్చొని అలా వీడియో గేమ్స్‌ ఆడుతూనే ఉంటాడు. మా అమ్మాయి కూడా అంతేనండి అస్సలు మొబైల్‌ వదలదు’ ఇలా తల్లిదండ్రులు తరచూ చెబుతుంటడం వినే ఉంటాం. ఆటల మోజులో పడి చదువును పక్కన పెడుతున్నాడని వాపోయిన అమ్మానాన్నలెందరో. మరోవైపు కంటి సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్నారని ఆస్పత్రుల చుట్టూ తిప్పిన సందర్భాలూ లేకపోలేదు. అయితే వీడియో గేమ్స్‌ ఆడటం మంచిదేనని ఓ పరిశోధనలో తేలింది. దీని వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుందని వెల్లడైంది. దీని ప్రభావం భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని స్పష్టమైంది.

ఎక్కువగా డిస్‌ప్లే చూడటం వల్ల కంటి సమస్యలు తలెత్తే మాట వాస్తవమే. అయినప్పటికీ వీడియోగేమ్స్‌ ఆడే వారిలో మెదడు చురుగ్గా పని చేస్తుందని స్పెయిన్‌కు చెందిన ఒబెర్టా డి కెటలూనియా నిర్వహించిన సర్వేలో తేలింది. దీనికోసం 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 27 మందిని నెల రోజుల పాటు పరీక్షించారు. వీరిలో కొంతమందికి వారివారి పనులతోపాటు వీడియోగేమ్స్‌ ఆడిపించారు. మరికొందరిని వారి పనికి మాత్రమే  పరిమితం చేశారు. వీరి మెదడు పని తీరును ఎప్పటికప్పుడు గమనించారు. వీరిలో వీడియో గేమ్స్‌ ఆడేవారి మెదడు చురుగ్గా పని చేయడం గమనించారు. ఈ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ‘ఫ్రాంటియర్స్‌’ కథనాన్ని ప్రచురించింది.

ఇదో చక్కని మార్గం

మరోవైపు వీడియో గేమ్స్‌ ఎక్కువగా ఆడటం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందనే వాదనను పరిశోధకులు తోసిపుచ్చారు. ‘‘ మన ప్రమేయం లేకుండా మనలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి వీడియోగేమ్స్‌ ఓ చక్కని మార్గం’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త మార్క్‌ పాలస్‌ వెల్లడించారు. చిన్నారులు వీడియోగేమ్స్‌ ఆడితే వచ్చే చురుకుదనం భవిష్యత్‌లోనూ ప్రభావం చూపిస్తుందని అన్నారు.  వీడియోగేమ్స్‌ ఆడటం మంచిదా? చెడ్డదా అనే విషయంపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. 2017లోనూ మార్క్‌ పాలస్‌ ఓ పరిశోధన చేశారు. వీడియో గేమ్స్‌ ఆడే వారిలో మెదడులోని హిప్పోకాంపస్‌ భాగం ఎక్కువగా పెరగడాన్ని గమనించారు. మెదడులోని వివిధ భాగాలు వివిధ ప్రక్రియలకు ఉపయోగపడతాయన్న విషయం మనందరికీ తెలుసు. అలాగే హిప్పోకాంపస్‌ నేర్చుకోవడం, వాటిని గుర్తుపెట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిని బట్టి భవిష్యత్‌లో మతిమరుపు లాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.

అన్ని గేమ్స్‌ వల్లా కాదు..!
వీడియో గేమ్స్‌ ఆడినంత మాత్రాన బ్రెయిన్‌ చురుగ్గా పని చేస్తుందా? అంటే కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. ఏ వీడియో గేమ్‌ ఆడామన్న దానిపైన బ్రెయిన్‌ పనితీరు ఆధారపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడుకు అంతగా పని చెప్పని వీడియో గేమ్స్‌ ఆడిన వారి మెదడులో గ్రే మేటర్‌ తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియల్‌ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. మెదడు ఉపయోగించి ఆడాల్సిన పజిల్‌గేమ్స్‌, ఆన్‌లైన్‌ చెస్‌ తదితర గేమ్స్‌ ఉపయుక్తంగా ఉంటాయని, ఎవరికైనా సూచించాల్సి వస్తే అలాంటి వాటినే చెప్పాలని గ్రేజరీ వెస్ట్‌ అనే పరిశోధకుడు చెబుతున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని