Padma Awards: పద్మ అవార్డులు వరించిన తెలుగు తేజాలకు ప్రముఖుల అభినందనలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పురస్కారాలతో సత్కరిస్తుంది. 2021 ఏడాదికి సంబంధించి నలుగురికి ...

Published : 26 Jan 2022 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పురస్కారాలతో సత్కరిస్తుంది. 2021 ఏడాదికి సంబంధించి నలుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మ విభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఏడుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. తెలంగాణ నుంచి నలుగురుకి, ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు వచ్చాయి. 

భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు (సంయుక్తంగా) పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపిక కాగా.. పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి గోసవీడు షేక్‌ హసన్ ‌(కళారంగం‌); డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం‌); గరికపాటి నరసింహారావు ఉండగా..  తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు‌), రామచంద్రయ్య (కళలు),  పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. 

పద్మ పురస్కరాలు వరించడంపై ప్రముఖుల స్పందన..  

‘‘పద్మపురస్కరాలకు ఎంపికైన తెలుగు తేజాలకు అభినందనలు. కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల పద్మభూషణ్‌కు ఎంపికకావడం ముదావహం. సత్యనాదెళ్ల, గరికపాటికి శుభాకాంక్షలు’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి రమణ పేర్కొన్నారు. 

రాష్ట్రంలో పలువురికి పద్మ పురస్కారాలు రావడం సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పద్మభూషణ్‌ అవార్డు వరించిన కృష్ణ ఎల్ల, సుచిత్రను సీఎం అభినందించారు. కళల విభాగంలో పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్న దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజారెడ్డిని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు.  

‘‘ఏడుగురు తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు దక్కడం సంతోషకరం. భారత్‌ బయోటెక్‌ సీఎండీ, జేఎండీలకు శుభాకాంక్షలు. పద్మ భూషణ్‌ అవార్డు దక్కినందుకు వారికి అభినందనలు. కొవిడ్‌ టీకా తయారీలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చింది’’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబు తెలిపారు.  

‘‘పద్మపురస్కారాలు దక్కిన తెలుగువారికి హృదయపూర్వక అభినందనలు’’ అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని