కస్టమర్లు చేసే తప్పులకు మేము ఎలా బాధ్యత వహిస్తాం?

తమ వినియోగదారులు చేసే తప్పులకు తామెలా బాధ్యులవుతామని పెగాసస్‌ స్పైవేర్‌ తయారీ కంపెనీ ఎన్‌.ఎస్‌.ఒ గ్రూపు ప్రశ్నిస్తోంది. స్పైవేర్‌ను తయారు చేసినందుకు ఈ సంస్థ గత కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది.  దాదాపు నలభై దేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, దేశాధినేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పెగాసస్‌ స్పైవేర్‌ బారిన పడ్డారు.

Published : 25 Jul 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ వినియోగదారులు చేసే తప్పులకు తామెలా బాధ్యులవుతామని పెగాసస్‌ స్పైవేర్‌ తయారీ కంపెనీ ఎన్‌.ఎస్‌.ఒ గ్రూపు ప్రశ్నిస్తోంది. స్పైవేర్‌ను తయారు చేసినందుకు ఈ సంస్థ గత కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది.  దాదాపు నలభై దేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, దేశాధినేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పెగాసస్‌ స్పైవేర్‌ బారిన పడ్డారు. దాదాపు 50 వేల ఫోన్‌ నంబర్ల జాబితా లీక్‌ అయింది. ఈ స్పైవేర్‌ సాయంతో ఏ కంపెనీ ఫోన్‌నైనా హ్యాక్‌ చేయవచ్చు. ఐ ఫోన్‌కు కూడా దీనినుంచి రక్షణ లేదు. 

పెగాసస్‌ను తయారు చేసిన సంస్థ దీనిని కేవలం ఉగ్రవాదులు, నేరచరితులపై నిఘా పెట్టడానికి రూపొందించిందని చెబుతోంది. కానీ దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గూఢచర్యం చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుని నంబర్‌ కూడా ఈ స్పైవేర్‌కు లక్ష్యంగా ఉన్నట్లు ఆ దేశంలో మీడియా కథనాలు వెలువడ్డాయి. కానీ ఎన్‌.ఎస్‌.ఒ. గ్రూపు ప్రతినిధి మాత్రం ఇందులో తమ కంపెనీ తప్పేమీ లేదని చెబుతున్నారు. తమకంపెనీ కస్టమర్లు కేవలం కొన్ని వందలు మాత్రమేననీ, వేలల్లో మాకు వినియోగదార్లు లేరని బుకాయిస్తున్నారు. 

మరోవైపు ఇజ్రాయెల్‌ దేశమే అణచివేతకు పెట్టింది పేరనీ, కాబట్టి అణచివేతకు పాల్పడే మిగతా దేశాల ప్రభుత్వాలకు ఈ స్పైవేర్‌ను అమ్మారని అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలోనే ఎస్‌ఎస్‌ఒ గ్రూప్‌ తన ట్రాన్స్‌పరెన్నీ నివేదికను బహిర్గతం చేయడం విశేషం. ఆ రిపోర్టులో ‘మానవహక్కులు, ప్రజల గోప్యత, భద్రతను ఎప్పటికప్పుడు గ్యారంటీ చేయడానికి పారదర్శకంగా పని చేయాలి’ అని తెలిపింది. గత బుధవారం ఇటీవలి పరిణామాలపై స్పందించిన ఆ కంపెనీ ప్రతినిధి, ‘‘తమ క్లయింట్లు తప్పు చేస్తే దానికి తమదెలా బాద్యతవుతుంది?మేం ఈ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు అమ్మాం. ఇదంతా
చట్టపరంగానే జరిగింది. మా వినియోగదార్లు దాన్ని దుర్వినియోగపరిస్తే అలాంటివారితో తెగతెంపులు చేసుకుంటాం. కానీ వినియోగదార్లు చేసే తప్పులకు వారిదే బాధ్యత. ఇందులో కంపెనీకేమీ సంబంధం లేదు’’ అని అన్నారు. పెగాసస్‌ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగడంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్పైవేర్‌ దుర్వినియోగంపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఇదిలావుంటే పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తన ఫోన్‌ నంబరు కూడా పెగాసస్‌ జాబితాలో ఉండటంతో, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఐక్యరాజ్యసమితిని కోరతామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని