పైకప్పుపై సోలార్‌ ప్లాంట్‌.. ఈ విషయంలో జాగ్రత్త!

పైకప్పుపై సోలార్‌ ప్లాంట్‌ (ఆర్‌టీఎస్‌) పథకం విషయంలో ప్రభుత్వం వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వ గుర్తింపు ఉన్న సౌర సంస్థలుగా చెప్పుకొనే.......

Published : 19 Jan 2021 01:25 IST

దిల్లీ: పైకప్పుపై సోలార్‌ ప్లాంట్‌ (ఆర్‌టీఎస్‌) పథకం విషయంలో ప్రభుత్వం వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వ గుర్తింపు ఉన్న సౌర సంస్థలుగా చెప్పుకొనే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కేవలం ఆయా రాష్ట్రాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్స్‌) ద్వారా మాత్రమే ఈ పథకం అమలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్‌ మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఓ ప్రకటన ద్వారా వినియోగదారులకు సూచనలు చేసింది. 

‘కొన్ని సోలార్‌ కంపెనీలు తాము సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారం పొందినట్లుగా చెప్పుకొంటూ.. ఇళ్లపై సౌర ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. పునరుత్పాదక విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నుంచి ఏ కంపెనీ కూడా అనుమతి పొందలేదు. కేవలం ఆయా రాష్ట్రాల్లోని డిస్కమ్స్‌ ద్వారా మాత్రమే ఈ పథకం అమలవుతుంది. డిస్కమ్స్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తి చేసి, ధరలు నిర్ణయించిన తర్వాతే అమలు చేయడానికి సాధ్యమవుతుంది’ అని తెలిపింది. 

‘పైకప్పు సోలార్‌ ప్లాంట్‌’ పథకం ద్వారా 2022 నాటికి 40వేల మెగావాట్ల విద్యుత్‌ సాధించాలనేది పునరుత్పాదక విద్యుత్‌ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ప్రభుత్వం 3 కిలోవాట్ల వరకు ఉండే ప్లాంట్‌ ఏర్పాటుకు 40 శాతం, 10 కిలోవాట్ల వరకు ఉండే ప్లాంట్‌ ఏర్పాటుకు 20 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోందని తెలిపింది. డిస్కమ్‌లు నిర్ణయించిన ధరను మాత్రమే చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. ఈ పథకం ప్రయోజనాలు పొందాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా డిస్కమ్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఏదైనా సమాచారం కావాలంటే వినియోగదారులు సంబంధిత డిస్కమ్స్‌ కార్యాలయాన్ని లేదా పునరుత్పాదక మంత్రిత్వ శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 180 3333ను సంప్రదించొచ్చని తెలిపింది.

ఇదీచదవండి

దీదీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా: సువేందు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని