AP PRC: అప్పటివరకు చర్చల్లేవ్‌.. మంత్రుల కమిటీకి లేఖ అందజేత

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ

Updated : 25 Jan 2022 17:06 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణపై ఇవాళ భేటీ అయిన పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నేతలు పలు విషయాలపై చర్చించారు. చర్చలకు రావాలంటూ జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆహ్వానించిన నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో జీవోలు రద్దు చేయాలని కోరుతూ మంత్రుల కమిటీకి లేఖ రాశారు. 

అనంతరం మంత్రుల కమిటీ ఆహ్వానం నేపథ్యంలో స్టీరింగ్‌ కమిటీ నేతలు ఆస్కార్‌ రావు, వైవీ రావు, హృదయరాజు, శివారెడ్డి తదితరులు సచివాలయానికి వెళ్లారు. ఈ మేరకు మంత్రుల కమిటీకి తమ నిరసన లేఖను అందజేశారు. ఆ లేఖలో ప్రధానంగా మూడు అంశాలను తమ డిమాండ్లుగా పేర్కొన్నారు. పీఆర్సీ జీవోల రద్దు, ఉద్యోగులకు పాత జీతాలు చెల్లింపు, పీఆర్సీపై అశుతోష్‌ మిశ్రా నివేదికను బయటపెట్టాలనే డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.

తదుపరి కార్యాచరణ కొనసాగుతుంది: ఆస్కార్‌రావు

 లేఖ అందజేసిన అనంతరం స్టీరింగ్‌ కమిటీ నేత ఆస్కార్‌ రావు మీడియాతో మాట్లాడారు. మూడు ప్రధానాంశాలను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని మంత్రుల కమిటీకి తెలిపామన్నారు. చర్చల ప్రక్రియ ఇవాళ జరగలేదని.. తమ తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకుండా చర్చలకు వెళ్లేది లేదని పునరుద్ఘాటించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని