Guinness World Records: ఆయనే అత్యంత పెద్ద వయస్కుడు..!

ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా ప్యూర్టో రికోకు చెందిన ఎమిలీయో ఫ్లోర్జ్‌ మార్క్వెజ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించారు.

Published : 01 Jul 2021 01:24 IST

లండన్‌: ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా ప్యూర్టోరికోకు చెందిన ఎమిలీయో ఫ్లోర్జ్‌ మార్క్వెజ్‌ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 112 ఏళ్ల 326 రోజుల వయసులో ఆయన ఈ ఘనత సాధించారు. ఈ మేరకు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ బుధవారం ప్రకటించింది. ఇంతకుముందు ఇదే రికార్డు రొమేనియాకు చెందిన డుమిత్రు కొమెస్కు పేరిట ఉండగా ఆయన 2020, జూన్‌ 27న మృతి చెందారు. అప్పటికి ఆయన వయసు 111 ఏళ్ల 219 రోజులు. ఆయన మరణం తర్వాత ఆ రికార్డును అధిగమించే వ్యక్తి కోసం వచ్చిన దరఖాస్తులను గిన్నిస్‌ అధికార ప్రతినిధులు పరిశీలించారు. ఈ క్రమంలో కొమెస్కు కన్నా మార్క్వెజ్‌ మూడు నెలల ముందు జన్మించినట్లు నిర్ధారణ చేసుకున్నారు. గిన్నిస్‌ బుక్‌లో అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన పేరును ఖరారు చేసి ధ్రవీకరణ పత్రం అందజేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లను ప్రపంచానికి పరిచయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్ చీఫ్‌ ఎడిటర్‌ క్రెయిగ్‌ గ్లెండే చెప్పుకొచ్చారు.

ప్యూర్టోరికోలోని కరోలినాలో 1908లో మార్క్వెజ్‌ జన్మించారు. తన తల్లిదండ్రులకు 11 మంది సంతానంలో ఆయన రెండోవారు. స్నేహతులకు ఆయన డాన్‌ మిలోగా సుపరిచితుడు. చిన్నతనంలో మూడేళ్లపాటు మాత్రమే పాశాలకు వెళ్లిన ఆయన అనంతరం తన కుటుంబానికి చెందిన చెరకు తోటలో పనిచేసేవారు. ఆయన భార్య ఆండ్రియా ప్రెజ్‌ డి ఫ్లోర్జ్‌ 2010లో.. 75 ఏళ్ల వయసులో మరణించారు. తన దీర్ఘాయువు వెనక ఉన్న రహస్యమేంటని అడగ్గా.. దయాగుణం కలిగి జీవించడమేనని ఆయన సమాధానమిచ్చినట్లు గిన్నిస్‌ ప్రతినిధులు తెలిపారు. ‘నా తండ్రి నన్ను ప్రేమతో పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని చెప్పాడు. అందరికీ మంచి చేయాలని నాతో పాటు నా తోబుట్టువులకు కూడా నేర్పించారు’ అని మార్క్వెజ్‌ చెప్పినట్లు వారు పేర్కొన్నారు.   


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని