‘ఒకే హోదా.. ఒకే పింఛను’ హామీని మోదీ నెరవేర్చారు

విశ్రాంత సైనికాధికారులకు ‘ఒకే హోదా.. ఒకు పింఛను’ విధానంపై ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రధాని నరేంద్ర మోదీ తన నిబద్ధతను చాటుకున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Published : 27 Jun 2021 18:10 IST

లేహ్‌: విశ్రాంత సైనికాధికారులకు ‘ఒకే హోదా.. ఒకు పింఛను’ విధానంపై ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రధాని నరేంద్ర మోదీ తన నిబద్ధతను చాటుకున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. మూడు రోజుల లద్దాఖ్‌ పర్యటనలో భాగంగా ఆదివారం లేహ్‌లో మాజీ సైనికోద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ విరమణ అనంతరం సైనికులకు ఎదురయ్యే సమస్యలపై స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగ విరమణ తర్వాత డైరెక్టరేట్‌ జనరల్‌ రీసెటిల్‌మెంట్‌ ద్వారా వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే చాలామంది మాజీలకు ఉద్యోగాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. సైనికులు దేశానికి రక్షణగా నిలిచినట్టుగానే వారి సంరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏ సమస్య తలెత్తినా తక్షణ సహాయం కోరేందుకు ఓ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దేశ రక్షణలో ప్రస్తుత, మాజీ సైనికుల అంకితభావం ఆదర్శవంతమైందని కొనియాడారు. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో) చేపట్టిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యటనలో భాగంగా ఆయన ప్రారంభిస్తారు. సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సైనికులతోనూ ఆయన మాట్లాడనున్నారు.  


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని