WW2:జర్మనీపై బ్రిటన్‌ ‘ఎలుక బాంబు’ ప్రయోగం

మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో అనేక దేశాలు పాల్గొని శత్రుదేశాలపై విజయం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇందులోభాగంగా ఆధునిక యుద్ధ యంత్రాలను వినియోగించాయి.. వినూత్న వ్యూహాలను అమలు చేశాయి. ఈ క్రమంలోనే జర్మనీని దెబ్బతీయాలని బ్రిటన్‌ ‘ఎలుక బాంబు’ల

Updated : 30 Sep 2020 11:25 IST

మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో అనేక దేశాలు పాల్గొని శత్రుదేశాలపై విజయం సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగా ఆధునిక యుద్ధ యంత్రాలను వినియోగించాయి.. వినూత్న వ్యూహాలను అమలు చేశాయి. ఈ క్రమంలోనే జర్మనీని దెబ్బతీయాలని బ్రిటన్‌ ‘ఎలుక బాంబు’ల వ్యూహం రచించింది. అది ఫలించలేదు గానీ.. జర్మనీ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది.

రెండో ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటన్‌కు స్పెషల్‌ ఆపరేషన్‌ ఎగ్జ్‌క్యూటీవ్‌(ఎస్‌వోఈ) బృందం ఒకటి ఉండేది. ఈ బృందం యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో గూఢచర్యం చేస్తూ, విధ్వంసం సృష్టించేది. ఈ బృందమే జర్మనీలోని నాజీకి చెందిన ఆయుధాల తయారీ కర్మాగారాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎలుకలతో ‘ర్యాట్‌ బాంబ్‌’ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఎలుకలను చంపి, వాటి శరీరం లోపలి అవయవాలు తొలగించి వాటి స్థానంలో పేలుడు పదార్ధాలు నింపింది. వాటిని కర్మాగారాల్లో వదిలేస్తే.. అక్కడి సిబ్బంది వాటిని మంటల్లో వేస్తారని, ఆ మంటల్లో పేలుడు పదార్థాలు పడి భారీ పేలుళ్లు జరుగుతాయని, కర్మాగారాలు నామరూపాలు లేకుండా పోతాయని ఊహించింది. 

తొలి ప్రయోగంగా ఎస్‌వోఈ సభ్యులు కొన్ని చనిపోయిన ఎలుకల్లో పేలుడు పదార్థాలు నింపి జర్మనీలోని కర్మాగారాల వద్ద వదిలేశారు. అయితే, ఎలా కనిపెట్టారో తెలియదు గానీ.. బ్రిటన్‌ ‘ర్యాట్‌ బాంబ్‌’ కుట్ర గురించి జర్మన్‌ సైనికులకు తెలిసిపోయింది. ఆ ఎలుకలను కనిపెట్టి మంటల్లో వేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత బ్రిటన్‌ ఇలాంటి ఎలుకలను వేలకొద్ది వదిలేసినట్లు అనుమానపడ్డారు. వెంటనే వాటికోసం వెతకడం ప్రారంభించారు. జర్మనీకి ‘ర్యాట్‌ బాంబ్‌’ గురించి తెలియడంతో బ్రిటన్‌ మరోసారి వాటిని ఉపయోగించలేదు. కానీ, జర్మనీ సైనికులు మాత్రం ఎలుకలను కనుగొనడంలో నిమగ్నమయ్యారు. కనిపెట్టిన ఎలుకలను పరీక్షల నిమిత్తం శాస్త్రవేత్తల వద్దకు పంపేవారు. అలా జర్మనీ తన వనరులను బాగా ఉపయోగించి నష్టపోయింది. ఈ ర్యాట్‌ బాంబ్‌ ప్రయోగం గురించి ఎస్‌వోఈ బృందం స్పందిస్తూ.. తాము ఎందుకోసం అయితే ఎలుకలను ఉపయోగించామో.. అది జరగకపోయినా అంతకుమించిన నష్టం వాళ్లకి కలిగిందని వ్యాఖ్యానించింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని