రెండో దశలోనూ పోటెత్తిన ఓటర్లు

చెదురుమదురు ఘటనల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.

Updated : 13 Feb 2021 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెదురుమదురు ఘటనల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పలుచోట్ల తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలో కూడా ఓటర్లు పోటెత్తారు. తొలిదశ  ఎన్నికల్లో భారీగా 81.42% పోలింగు నమోదైన విషయం తెలిసిందే. రెండో దశలో అదే విధంగా పోలింగ్‌ శాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం 6గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయంలో కమాండు కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలింగును కమిషనర్‌ గిరిజాశంకర్‌ పరిశీలిస్తున్నారు.

కృష్ణా జిల్లా నిమ్మకూరులోని పోలింగ్‌ కేంద్రంలో వివాదం తలెత్తింది. ఓటరుకు సహాయకుడిని పంపే విషయంలో తెదేపా, వైకాపా  శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు బాహాబాహీకి దిగే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.

>  శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. ఓటర్ల జాబితాలో అదనంగా ఓట్లు ఉన్నాయంటూ తెదేపా మద్దతు దారులు ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితాలోకి కొత్త పేర్లు ఎలా వచ్చాయో చెప్పాలని అధికారులను డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

ఇనిమెళ్లలో దొంగ ఓట్లు

తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వగ్రామమైన గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్లలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. ఎస్సీ కాలనీలోని 7వ బూత్‌ వద్ద వైకాపా వర్గీయులు ఒకరికి బదులు మరొకరు ఓటు వేస్తుండటంతో  ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వైకాపా ఏజెంట్లు తెదేపా ఓటర్ల నుంచి దౌర్జన్యంగా స్లిప్పులు లాక్కొని అడ్డుకుంటున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఈ ఘటనతో ఇనిమెళ్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి...

మీ అధికారాలను వాడండి

ఎన్నికలయ్యే వరకూ మీడియాతో మాట్లాడొద్దు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని