Sids Farm: అమెరికాలో ఉద్యోగం వదిలి.. స్వదేశంలో పాల వ్యాపారం!

అమెరికాలో ఇంటెల్ సంస్థలో ఉద్యోగం.. లక్షల రూపాయల జీతం. కానీ ఏదో వెలితి. స్వదేశానికి వెళ్లి వ్యవసాయం చేయాలనే ఆలోచనలు అతడిని అనునిత్యం వెంటాడాయి.

Published : 10 Nov 2021 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికాలో ఇంటెల్ సంస్థలో ఉద్యోగం. లక్షల రూపాయల జీతం. ఇంకేముంది లైఫ్‌ సెట్‌ అనుకుంటాం. కానీ అతడిలో ఏదో వెలితి. స్వదేశానికి వెళ్లి వ్యవసాయం చేయాలనే ఆలోచనే దానికి కారణం. ఎక్కువ రోజులు ఆ ఉద్యోగంలో కొనసాగలేదు. స్వదేశం వచ్చేశాడు. మనసుకు నచ్చిన వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. ఆ తర్వాత పాడి వ్యాపారంలో అడుగుపెట్టి.. ఇప్పుడు కల్తీ లేని స్వచ్ఛమైన పాలను అందిస్తూ, పలువురికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. ఆయనే కిశోర్‌ ఇందుకూరి. సిద్స్‌ డెయిరీ ఫామ్‌ అధిపతి.

ఖరగ్‌పుర్‌లో ఐఐటీ విద్యను అభ్యసించిన కిశోర్‌.. అమెరికాలోని ఇంటెల్ సంస్థలో ఆరేళ్లపాటు ఉద్యోగం చేశారు. వ్యవసాయం పట్ల మక్కువతో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కు వచ్చారు. వినియోగదారులకు కల్తీ లేని పాల ఉత్పత్తులను అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో.. 2013లో రెండున్నర ఎకరాల్లో ‘సిద్స్‌ డెయిరీ ఫామ్‌’ నెలకొల్పారు. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో మోడల్‌ డెయిరీ ఫామ్‌ సిద్ధం చేశారు. సిద్స్ డెయిరీ ఫామ్‌లో రోజూ 17 వేల లీటర్ల పాలు, పాల ఉత్పత్తులు సిద్ధమవుతాయి. వీటిని ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు, రిటైల్‌ స్టోర్ల ద్వారా వినియోగదారులకు అందజేస్తున్నారు.

సిద్స్‌ డెయిరీ ఫామ్‌లో 50 మంది, గ్రామీణ ప్రాంతాల్లో మరో 40 మంది పనిచేస్తున్నారు. సంస్థను ప్రారంభించిన కొత్తలో కిశోర్‌ చాలా ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు, వచ్చే ఆదాయానికి భారీ వ్యత్యాసం ఉండటంతో అనవసరపు ఖర్చులు తగ్గించారు. ఈ ఫామ్‌లో ఆవు, గేదె పాల ఉత్పత్తులను వేర్వేరుగా తయారు చేస్తారు. వ్యక్తిగత ప్రాధాన్యం, రుచి ఆధారంగా వినియోగదారులకు ఆవు, గేదె పాల నుంచి ఉత్పత్తి చేసే పెరుగు, నెయ్యి, వెన్న, పనీర్‌లను ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. పాలను నిత్యం పరీక్షించేందుకు అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. పాలలో ఎలాంటీ కల్తీ లేకుండా రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తన కుమారుడి పేరు మీద సిద్స్‌ డెయిరీ ఫామ్‌ను ప్రారంభించిన కిశోర్‌.. తన ఉత్పత్తుల్లో ఎప్పటికీ కల్తీ ఉండబోదని కుమారుడికి వాగ్దానం చేసినట్టు చెప్పారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నానని కిశోర్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని