అక్కడ సర్పాలే దైవాలు

కౌతారం మండల పరిధిలోని దొమ్మలదిన్నె, అగసలదిన్నె గ్రామాల్లో పాములను దైవంగా భావిస్తారు. అవి కనిపిస్తే పూజలు చేస్తారు. వారి ఇళ్లల్లోకి దూరినా వాటిని పట్టుకొని అడవిలో వదిలేస్తారు....

Updated : 25 Dec 2020 13:39 IST

పాము కాటువేస్తే తమ తప్పేనని భావన

ఇంటర్నెట్ డెస్క్‌: పామును చూస్తే చాలా మంది జడుసుకుంటారు. దాన్ని చంపకపోతే కాటేస్తుందేమోనని భయపడిపోతుంటారు. కానీ కర్నూలు జిల్లాలోని రెండు గ్రామాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. కౌతాళం మండల పరిధిలోని దొమ్మలదిన్నె, అగసలదిన్నె గ్రామాల్లో పాములను దైవంగా భావిస్తారు. అవి కనిపిస్తే పూజలు చేస్తారు. వారి ఇళ్లల్లోకి దూరినా వాటిని పట్టుకొని అడవిలో వదిలేస్తారు. వర్షాకాలంలో పదుల సంఖ్యలో పాములొచ్చి ఇబ్బంది పెట్టినా కనీసం వాటిమీద కోపం చూపించరు. పొరపాటున అవి కరిచినా అది తమ పాపమేనని అనుకుంటారు. ఇప్పటివరకు తమ ఊళ్లలో ఒక్క పామును కూడా చంపలేదని ప్రజలు గర్వంగా చెబుతారు.

సర్పాలను దేవుని స్వరూపాలుగా భావించి తమ ఇళ్లల్లోకి దేవుడే వచ్చాడని సంబరపడిపోతారు ఇరు గ్రామాల ప్రజలు. కర్రతో తోసినా వెళ్లకపోతే కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తారు. కళ్లు మూసి దండం పెట్టుకుంటే వాటంతటవే వెళ్లిపోతాయని గ్రామస్థులు నమ్ముతారు. ఈ రెండు గ్రామాల్లో నాగలింగేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇక్కడి దేవుడిని కరిపామన్న అనే పేరుతో కొలుస్తారు. ఏడాదికి ఒకసారైనా రథోత్సవం జరుపుతారు. ఈ రెండు గ్రామాలకు మధ్య భూగర్భంలోకి దారి ఉందని, అక్కడ పాములు సంచరిస్తాయని ఇరు గ్రామాల ప్రజలు నమ్ముతారు. పాము కాటువేస్తే ఆ వ్యక్తే తప్పుచేసినట్లు భావిస్తారు. ఇప్పటివరకు పాము కాటువేసిన సందర్భాలు తక్కువేనని ప్రజలు పేర్కొన్నారు. 

గతంలో ఏదో కనిపించని విష పురుగు కరిచి ప్రజలు మరణిస్తూ ఉంటే ఈ రెండు గ్రామాల్లో పామును పూజిస్తే పరిష్కారం దొరుకుతుందని ఓ ముని చెప్పాడనే కథ ప్రచారంలో ఉంది. అందుకే తమ పూర్వీకుల కాలం నుంచే పాములను పూజించే ఆచారం ఉందని స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి...

వధువు వద్దంది.. పెళ్లికొచ్చిన అమ్మాయే పెళ్లి కూతురైంది

ఫేమ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారుగా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని