భార్య నగలు అమ్మి ‘ఆటో అంబులెన్స్‌’

కరోనా విజృంభణ వేళ భారతావని ఆక్సిజన్‌ కోసం అల్లాడుతోంది. ఊపిరి నిలిపే ప్రాణవాయువు కరవై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో ఆక్సిజన్‌ అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి....

Updated : 01 May 2021 15:00 IST

భోపాల్‌ ఆటోడ్రైవర్‌ పెద్దమనసు

 

భోపాల్‌: కరోనా విజృంభణ వేళ భారతావని ఆక్సిజన్‌ కోసం అల్లాడుతోంది. ఊపిరి నిలిపే ప్రాణవాయువు కరవై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో ఆక్సిజన్‌ అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో ఎంతోమంది మంచి మనసుతో ముందుకొస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌. తన భార్య నగలను అమ్మి ‘ఆటో ఆంబులెన్స్‌’ ఏర్పాటుచేసిన అతడు రోగుల ఊపిరి నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు.

భోపాల్‌కు చెందిన జావేద్‌ ఖాన్‌ తన ఆటోనే ఆంబులెన్స్‌గా మార్చేశాడు. తన ఆటో ఎక్కే రోగుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా ఏర్పాటుచేశాడు. ఆక్సిజన్‌ సకాలంలో  అందక ఇబ్బంది పడుతున్న కొన్ని చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసి చలించిపోయాయనని, తన వంతుగా ఏదైనా చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావేద్‌ పేర్కొన్నాడు. ఇందుకోసం భార్య నగలు అమ్మి ఆటో ఆంబులెన్స్‌ కోసం వెచ్చించినట్లు తెలిపాడు. వైరస్‌ సోకి బాధపడుతున్నవారికి ఉచితంగా అత్యవసర సేవలందించి ఆసుపత్రులకు తరలించేందుకే ఈ ఆంబులెన్స్‌ సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నాడు.

ఆక్సిజన్‌, శానిటైజర్‌, ఔషధాలతో ఆటోను ఆంబులెన్స్‌గా మార్చేశాడు. గంటల పాటు క్యూలో ఉండి సుమారు రూ.400 వెచ్చించి స్థానిక పరిశ్రమలో ఆక్సిజన్‌ సిలిండర్‌ను నింపిస్తున్నాడు. ఫోన్‌ చేసిన వారి వద్దకు వెళ్లి.. వారిని ఉచితంగా ఆసుపత్రికి తరలిస్తున్నాడు. గత 20 రోజుల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న తొమ్మిది మందిని హాస్పిటల్‌కు తరలించాడు. కరోనా భయంతో కుటుంబసభ్యులే దగ్గరకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు జావేద్‌ చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని