Offbeat: ఆడపిల్ల పుట్టిందని ఆ తండ్రి అమితానందం.. ఏం చేశాడంటే?

తన ఇంట ఆడపిల్ల పుట్టిందని ఆ తండ్రి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తన ఇంటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని సంబురపడ్డాడు......

Published : 14 Sep 2021 01:43 IST

భోపాల్‌: తన ఇంట ఆడపిల్ల పుట్టిందని ఆ తండ్రి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తన ఇంటికి సాక్షాత్తూ మహాలక్ష్మి వచ్చిందని సంబురపడ్డాడు. ఈ సంతోష సమయాన్ని పట్టణ ప్రజలతో పంచుకోవాలనుకున్నాడు పానీపూరీ వ్యాపారం చేసే ఆ చిరు వ్యాపారి. ఆదివారం తన షాపు వద్దకు వచ్చిన కస్టమర్లకు ఉచితంగా పానీపూరీ అందించి తన ఆనందాన్ని వారితో పంచుకున్నాడు. కుమార్తెలతోనే భవిష్యత్తు ఉందన్న అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఆంచల్‌ గుప్తా(30) పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడు. సంతానంగా ఆడపిల్ల కావాలని అతడికి ఎంతో ఆశ. అయితే రెండేళ్ల క్రితం భార్యకు మొదటి కాన్పులో అబ్బాయి జన్మించడంతో కొంత నిరాశకు గురయ్యాడు. కానీ రెండో కాన్పులో అతడి కోరిక నెరవేరింది. ఆగస్టు 17న ఆంచల్‌ గుప్తా భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ చిరువ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆడబిడ్డలతోనే భవిష్యత్తు ఉందన్న అతడు.. ఈ ఆదివారం తన షాపు వద్దకు వచ్చిన అందరికీ ఉచితంగా పానీపూరీ అందించాడు. తన ఆనందాన్ని కస్టమర్లతో పంచుకున్నాడు. దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఆంచల్‌ గుప్తా ఈసందర్భంగా మాట్లాడుతూ.. ‘వివాహం జరిగినప్పటినుంచి ఆడబిడ్డ సంతానంగా కావాలని ఉండేది. ఇప్పుడు నా కల నెరవేరినట్లయ్యింది. ఈ ఆనందాన్ని ప్రజలతో పంచుకోవాలనుకున్నా. పురుషులకు మహిళలు ఏమాత్రం తక్కువ కాదని తెలియజేయాలనుకున్నా. ఉచితంగా పానీపూరీ అందించాలనుకున్నా. రూ.35వేల నుంచి రూ.45వేల వరకు పానీపూరీ ఉచితంగా అందించా. కుమార్తె పుట్టిందన్న ఆనందం ముందు ఈ ఖర్చు పెద్దది కాదు’ అని ఆంచల్‌ గుప్తా పేర్కొన్నారు. పానీపూరీ ఉచితంగా అందించడంతో ప్రజలు అక్కడ క్యూలు కట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని