TS News: మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ  సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Updated : 17 Jan 2022 23:33 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు తొమ్మిది గంటల పాటు మంత్రివర్గం పలు విషయాలపై చర్చించింది. పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులకు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

కీలక నిర్ణయాలు..

* తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

* సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణ కోసం కంపెనీస్ యాక్ట్ (COMPANIES ACT) 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఈ కార్పొరేషన్‌కు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈఎన్‌సీ (జనరల్), ఈఎన్‌సీ (గజ్వేల్‌), ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.

*సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించే ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.16.23 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

*గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ. 669 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

* వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

*వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.27.36 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోదించింది.

* నిజాం నవాబుల కాలంలో మెదక్ జిల్లా ఘన్‌పూర్‌లో నిర్మించిన ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించారు. ఆ సమయంలో మిగిలిపోయిన మరికొన్ని పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. 

* ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాకా-కోరాటా బ్యారేజికి సంబంధించి రూ.795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే బ్యారేజి నిర్మాణం పూర్తి అయ్యింది. పంప్ హౌజ్ నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో భీమ్‌పూర్‌, జైనథ్, బేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

*వనపర్తి జిల్లాలో గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.71 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

* సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుంచి తపాస్‌పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తపాస్‌పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు సాగునీరు అందనున్నది.

*మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్‌పూర్‌ బ్రాంచి కాలువ పనులకు రూ.144.43 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా ఘన్‌పూర్‌, అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 

*సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’(ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ (ఆనర్స్) నాలుగేళ్ల డిగ్రీ చేసి, అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌‌ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.

*అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు రేపు(మంగళవారం) సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.

*దేవాదుల పథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులకు, గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు, నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణానికి మొత్తం రూ.104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని