తెలంగాణలో క్రమంగా విస్తరిస్తోన్న సెకండ్‌ వేవ్‌..

తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ క్రమక్రమంగా విస్తరిస్తోంది. పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించేందుకు....

Published : 10 Apr 2021 11:25 IST

పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో కరోనా రెండో దశ విజృంభణ‌ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రాల సంఖ్య  పెంచి, నమూనాలను త్వరితగతిన సేకరించనుంది.

హైదరాబాద్‌లో 4 కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బేగంపేటలోని నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చార్మినార్‌లోని నిజామియా టీబీ ఆసుపత్రి, మెహదీపట్నంలోని సరోజినీ కంటి ఆసుపత్రిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ పూర్తిస్థాయిలో కరోనా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను అరికట్టాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతిఒక్కరు మాస్కు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగేవారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, పోలీసుస్టేషన్‌ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే నలుగురు వ్యక్తులు మృతిచెందడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1235కు చేరడం భయాందోళనకు గురిచేస్తోంది. పక్కనే ఉన్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లోని గ్రామాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజు 400లకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న గ్రామాల్లో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా కట్టడికి స్థానికంగా పలుచోట్ల లాక్‌డౌన్లు‌ విధించుకుంటున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అంగడి బజార్‌లో కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఏసీపీ మహేందర్‌ మాస్కులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. మల్యాలలో రెండు రోజుల్లో 134 కేసులు నమోదు కావడంతో మరిన్ని పరీక్షలు నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రవి ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు