High Blood Pressure: అధిక రక్తపోటు బాధితులు.. 30 ఏళ్లలో రెట్టింపు

ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితుల సంఖ్య గత 30 ఏళ్లలో రెట్టింపు అయినట్టు ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ ‘ద లాన్సెట్‌’ వెల్లడించింది.

Published : 26 Aug 2021 11:28 IST

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితుల సంఖ్య గత 30 ఏళ్లలో రెట్టింపు అయినట్టు ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ ‘ద లాన్సెట్‌’ వెల్లడించింది. ఈ బాధితుల్లో ఎక్కువమంది అల్ప, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారేనని పేర్కొంది. 184 దేశాలకు చెందిన సుమారు 10 కోట్ల మంది రక్తపోటు ఫలితాలను అంతర్జాతీయ పరిశోధకుల బృందం విశ్లేషించింది. నమూనాలన్నీ గత మూడు దశాబ్దాల్లో, 30-79 ఏళ్ల వయసు వారికి చెందినవే తీసుకున్నారు. 1990లో 33.1 కోట్ల మంది మహిళలు, 31.7 కోట్ల మంది పురుషులు అధిక రక్తపోటుతో బాధపడగా... 2019 నాటికి బాధిత మహిళల సంఖ్య 62.6 కోట్లకు, పురుషుల సంఖ్య 65.2 కోట్లకు చేరినట్టు పరిశోధకులు లెక్కగట్టారు. అయితే, వీరిలో సగం మందికి అసలు తమకు అధిక రక్తపోటు సమస్య ఉందనే తెలియదట! బాధిత మహిళల్లో 53% మంది, పురుషుల్లో 62% మంది ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదట. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న 85 లక్షలకుపైగా మరణాలకు అధిక రక్తపోటే ప్రధాన కారణమని అధ్యయనంలో పాల్గొన్న లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ మాజిద్‌ ఎజాటి చెప్పారు.

అధిక రక్తపోటు కారణంగా చాలామంది హృద్రోగం, మూత్రపిండ వ్యాధులు, పక్షవాతం బారిన పడుతున్నట్టు పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. రక్తపోటును తగ్గించే చికిత్సతో పక్షవాతం ముప్పు 35-40%, గుండె వైఫల్య ప్రమాదం 50%, హృద్రోగాలు 20-25% తగ్గుతాయని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని