Sirivennela: సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల: సీఎం జగన్‌

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల  ఏపీ సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ‘‘తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో

Updated : 30 Nov 2021 18:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ‘‘తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగు వారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం తెలుగు వారికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. సిరి వెన్నెల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

సిరివెన్నెల అభిమానుల్లో నేనూ ఒకణ్ని: ఉపరాష్ట్రపతి

సిరివెన్నెల మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని తెలుగు భాషకు పట్టం కడుతూ ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో తాను ఒకరినన్నారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్‌ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సి రావడం విచారకరమన్నారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చలనచిత్ర రంగానికి తీరని లోటు: సీఎం కేసీఆర్‌

తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారన్నారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలుగు సాహితీలోకానికే తీరని లోటు: చంద్రబాబు

అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 3వేలకు పైగా పాటలు రాసి సంగీత ప్రియుల్ని అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల రాసిన పాటల్లో తన ఫేవరేట్‌ సాంగ్‌ ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ..’’ అని వీవీ లక్ష్మీనారాయణ ట్విటర్‌లో పంచుకున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం ప్రజలకు, తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. సీతారామశాస్త్రి రాసిన ప్రతి పాట ప్రజల మనసును దోచుకునేలా ఉంటాయి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన రాసిన పాటల రూపంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కవి సామ్రాట్ సిరివెన్నెల. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

- ఎంపీ విజయసాయిరెడ్డి

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సినీ రంగంలో అనేక అవార్డులు, పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన వ్యక్తి సిరివెన్నెల. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సిరివెన్నెల సీతారామశాస్త్రి జాతీయవాదం, దేశ భక్తి, మానవతా విలువలకు మారుపేరుగా నిలిచిన గొప్ప గేయ రచయిత. ఆయన మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కష్టకాలంలో బాధను తట్టుకోవడానికి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

- హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

కోటి రాగాల కోయిలమ్మకు నల్లటి రంగు ఏమిటని ప్రశ్నించిన ఆ స్వరం ఇంత త్వరగా శాశ్వత నిద్రలోకి జారుకుంటుందని ఉహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

- మంత్రి జగదీశ్‌ రెడ్డి

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు సినిమా రంగానికి, సాహిత్య లోకానికి తీరనిలోటు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. సీతారామశాస్త్రి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

- రేవంత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని