AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’ ఫలితాలు విడుదలయ్యాయి...

Updated : 08 Sep 2021 13:14 IST

అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఇవాళ ఉదయం మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 14న వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విభాగంలో 80.62శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే వెయ్యిమంది అదనంగా ఉత్తీర్ణత సాధించారన్నారు. రేపటి నుంచి ర్యాంక్‌ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతపురానికి చెందిన నిఖిల్‌కు మొదటి ర్యాంకు వచ్చిందన్నారు. శ్రీకాకుళానికి చెందిన వరదా మహంతనాయుడుకు రెండో ర్యాంకు వచ్చాయని తెలిపారు. ఇద్దరికి నాలుగో ర్యాంకు వచ్చినట్లు మంత్రి వివరించారు. కడప జిల్లాకు చెందిన వెంకట పణీష్‌, విజయనగరం జిల్లాకు చెందిన దివాకర్‌సాయికి నాలుగో ర్యాంకు దక్కినట్లు తెలిపారు.

తొలుత ఇంజినీరింగ్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌), ఆ తర్వాత వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు 1,76,603మంది దరఖాస్తు చేయగా.. 1,66,460మంది హాజరయ్యారు. ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు. వైద్యవిద్యలో ప్రవేశాలకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్‌) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ‘ఎం’ అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మసీ ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్షద్వారా నిర్వహిస్తున్నందున ‘ఎం’ స్థానంలో ‘పి’ ని చేర్చి ఈఏపీసెట్‌గా మార్పు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని