Ap News: ఉద్యమబాటలో ఏపీ ఉద్యోగ సంఘాలు .. సీఎస్‌కు నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు

పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. స్నేహపూర్వక

Updated : 01 Dec 2021 17:04 IST

అమరావతి: పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నామని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. స్నేహపూర్వక గవర్నమెంట్‌ అని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు కన్నీటి మూటలే అయ్యాయని మండిపడ్డారు. ఉద్యమ కార్యాచరణను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణమని, ఇప్పటికీ పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేదని విమర్శించారు. 7వ తేదీలోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్‌ సమీర్‌శర్మ హామీ ఇచ్చారని, జీపీఎఫ్‌ బిల్లులను వెంటనే క్లియర్‌ చేయాలని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

ఐదు పేజీల ఉద్యమ కార్యాచరణ లేఖను నోటీసు రూపంలో సీఎస్‌కు అందించామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా సమయంలో 4..5వేల మంది ఉద్యోగులు చనిపోయారని, ప్రభుత్వం కారుణ్య నియామకాలు జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడం లేదని నిలదీశారు. చట్టబద్ధంగా వేసిన పీఆర్సీ నివేదికను మార్చే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. పీఆర్సీ నివేదికలో చెప్పకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా అని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు ఉద్యోగులను కించపరిచే విధంగా ఉన్నాయన్న బొప్పరాజు.. పీఆర్సీ అమలు విషయంలో ఆర్థిక మంత్రి ఉద్యోగులతో చర్చలు జరపడం సంప్రదాయమని గుర్తు చేశారు. బుగ్గన ఒక్క రోజైనా ఉద్యోగులతో మాట్లాడారా? ఆయన అందుబాటులో ఉన్నదెప్పుడు అని నిలదీశారు. రెండో దశ ఉద్యమంలోకి వెళ్లేలోపే ప్రభుత్వం స్పందించాలని హితవు పలికారు. సీఎం స్పందిస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని అర్ధమవుతోందన్నారు. 7వ తేదీ నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారని, 10వ తేదీ మధ్యాహ్నం భోజన విరామంలో నిరసనలు చేస్తామని, 13న తాలూకా, డివిజన్‌ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. 27 నుంచి విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తామని బొప్పరాజు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని