UK Covid: కళ్లు చెదిరే డబ్బంతా.. కొవిడ్‌ పరీక్షలపాలు..!

కొవిడ్‌ కట్టడిలో భాగంగా టెస్టింగ్‌, ట్రేసింగ్‌ కోసం బ్రిటన్‌ ప్రభుత్వం పెట్టిన 37 బిలియన్‌ పౌండ్ల ఖర్చంతా చివరకు వృధానే అయ్యిందని అక్కడి ప్రతిపక్ష ఎంపీలు రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది.

Updated : 28 Oct 2021 04:46 IST

వేలకోట్ల ప్రజాధనం వృధా అయ్యిందన్న బ్రిటన్‌ ఎంపీల నివేదిక

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు యావత్‌ ప్రపంచ దేశాలు ఎంతో శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, ట్రేసింగ్‌, చికిత్స కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నాయి. ఇందులో భాగంగా బ్రిటన్‌ ప్రభుత్వం దాదాపు 37 బిలియన్‌ పౌండ్లను (సుమారు మూడున్నర లక్షల కోట్లు) ఖర్చు చేసింది. అయితే, కొవిడ్‌ కట్టడిలో భాగంగా టెస్టింగ్‌, ట్రేసింగ్‌ కోసం బ్రిటన్‌ ప్రభుత్వం పెట్టిన ఈ భారీ ఖర్చంతా చివరకు వృథానే అయ్యిందని అక్కడి ప్రతిపక్ష ఎంపీల ఆధ్వర్యంలోని తాజా నివేదిక వెల్లడించింది.

సరైన వ్యూహం లేకుండానే..

కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం దాదాపు 37 బిలియన్‌ పౌండ్లు (51 బిలియన్‌ డాలర్లు) ఖర్చు పెట్టింది. వీటి ఫలితాలను అంచనా వేసేందుకు అక్కడి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు చెందిన ప్రజాపద్దుల కమిటీ ఓ నివేదికను రూపొందించింది. ప్రభుత్వంతోపాటు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన అనుభవం లేని వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల కొవిడ్‌ పరీక్షలు, ట్రేసింగ్‌ కోసం పెట్టిన భారీ ఖర్చు వృథా అయ్యిందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చివరకు వాగ్దానం చేసిన దానికంటే తక్కువ ఫలితమే కనిపించిందని ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందిన మెగ్‌ హిల్లియర్‌ పేర్కొన్నారు. కళ్లు చెదిరేంత ప్రజాధనం ఇలా వృథా కావడం ఆందోళన కలిగిస్తోందన్న ఆమె.. పన్ను చెల్లింపుదారుల పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోయిందని మండిపడ్డారు.

గతేడాది కొవిడ్‌ మహమ్మారి విజృంభణ మొదలైన సందర్భంలో కేసులను గుర్తింపు, ట్రేసింగ్‌ కోసం భారీ కార్యక్రమాన్ని చేపట్టిన బ్రిటన్‌ ప్రభుత్వం.. ఇందుకోసం ప్రభుత్వ ఆరోగ్య సేవలను వినియోగించుకోకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లపై ఆధారపడడాన్ని ప్రజాపద్దుల కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమంతో కొవిడ్‌ లక్షణాలున్న కొంత మంది మాత్రమే ఈ పరీక్షలు చేయించుకున్నారని అభిప్రాయపడింది. చివరకు కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసే వ్యూహంలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించకపోయిందని స్పష్టం చేసింది.

సమర్థించుకున్న ప్రభుత్వం..

బ్రిటన్‌ ప్రభుత్వం మాత్రం తమ టెస్టింగ్‌ కార్యక్రమాన్ని సమర్థించుకుంది. యూరోపియన్‌ దేశాల్లో ఎక్కడాలేని విధంగా ఎక్కువ మంది బ్రిటన్‌ ప్రజలు కొవిడ్‌ టెస్టులు చేయించుకున్నట్లు తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడడం, కొవిడ్‌ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడంతోపాటు స్థానిక విజృంభణను వేగంగా గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని