Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 18 Jan 2022 17:06 IST

1. ‘రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ ఫిట్‌మెంట్‌’

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

రెండతస్తుల మిద్దెపై ద్రాక్ష తోట.. ఎలా పెంచాడంటే?

2. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం, రణం, రుధిరం). ఈనెల 7న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించిన కారణంగా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు తెలిపారు. చిత్రంలో అభూత కల్పనలు వద్దని.. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే సహించమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పని చేయించుకోకుండా జీతాలిస్తే ప్రజాధనం వృథా అయినట్లే: హైకోర్టు

ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్‌ సింగ్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పోస్టింగులు ఇవ్వకుండా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పని చేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృథా అయినట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. టీచర్లు లేకుండా ఆంగ్ల విద్య ఎలా అందిస్తారు?: రేవంత్‌

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.  టీచర్లు లేకుండా ఆంగ్ల విద్య ఎలా అందిస్తారని ప్రశ్నించారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం అమలును సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వచ్చే 3 వారాలు చాలా కీలకం: మంత్రి హరీశ్‌రావు

కరోనా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే 3 వారాలు చాలా కీలకమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నారాయణపేట జిల్లా కోయిల్‌కొండలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాట చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అందరూ తప్పకుండా మాస్క్‌ ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఇప్పుడు ‘అల్లు’నే కొత్త ‘మెగా’: వర్మ ఉద్దేశం ఏంటో?

ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న నేపథ్యంలో వివాహం బంధంపై ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుస ట్వీట్లు చేశారు. తెలివైన వ్యక్తులే ప్రేమిస్తారని, అమాయకులు పెళ్లి చేసుకుంటారని వ్యాఖ్యానించారు. మరోవైపు టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌పై పరోక్షంగా ఆర్జీవీ మరో సంచలన ట్వీట్‌ చేశారు. ‘ఇప్పుడు అల్లునే కొత్త మెగా హీరో. ఇది కఠినంగానే ఉన్నా.. కాదనలేని వాస్తవం’’అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్‌ ఇప్పుడు మెగా, అల్లు అభిమానుల్లో గందరగోళం సృష్టిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. సన్మానం అక్కర్లేదు.. బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన కోహ్లీ

ఇప్పటికే 99 టెస్టు మ్యాచులు పూర్తి చేసిన విరాట్‌ కోహ్లీ.. వందో మ్యాచ్‌ను తన రెండో హోమ్‌ గ్రౌండ్ అయిన బెంగళూరులో ఆడిన తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని బీసీసీఐ అధికారి ఒకరు సూచించారు. ఇన్నాళ్లూ భారత జట్టుని ముందుండి నడిపించినందుకు బీసీసీఐ కోహ్లీని ఘనంగా సన్మానించాలనుకుంటున్నట్టు తెలిపాడు. అయితే, బీసీసీఐ ఆఫర్‌ను కోహ్లీ తిరస్కరించాడు. ‘ఒక్క మ్యాచ్‌తో పెద్ద మార్పులేమీ రావు. అయినా, అలాంటి రికార్డులను, సెంటిమెంట్లను నేను పట్టించుకోను’ అని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కేసులుంటేనేం.. పాపులారిటీ ఉందిగా!

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గతవారం అధికార భాజపా 107 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొందరిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అయితే, కేసులు ఉన్నప్పటికీ.. పాపులారిటీ కారణంగానే ఆ నేతలకు టికెట్లు ఇచ్చినట్లు భాజపా వెల్లడించింది. అంతేగాక, రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే వారిపై కేసులు నమోదైనట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9.  పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎప్పుడంటే?

తమ వాహన ధరలను సగటున 0.9 శాతం మేర పెంచనున్నట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ ప్రకటించింది. కొత్త ధరలు ఈనెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ముడిపదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. జనవరి 18, 2022కి ముందు బుక్‌ చేసుకున్న కార్లకు ధరల పెంపు వర్తించదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బడ్జెట్‌ ధర.. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌తో రియల్‌మీ కొత్త ఫోన్

రియల్‌మీ (realme) 9 సిరీస్‌లో తొలి ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ 9ఐ (Realme 9i) పేరుతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ మోడల్‌గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంలో వచ్చిన రియల్‌మీ 8ఐ మోడల్‌కు కొనసాగింపుగా కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో వెనుకు మూడు కెమెరాలతో పాటు, సంగీత ప్రియుల కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని