ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?

‘జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాం కదా. మనకెందుకు గుండెజబ్బులు వస్తాయి?’ అని చాలామంది

Updated : 15 Jan 2021 15:56 IST

‘జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాం కదా. మనకెందుకు గుండెజబ్బులు వస్తాయి?’ అని చాలామంది అనుకుంటుంటారు. నిజమే. శారీరకశ్రమ, వ్యాయామం, ఆటలు శరీర సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతమాత్రాన గుండెజబ్బులు అసలే రావని అనుకోవటానికి లేదు. ఇటీవల భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ట్రెడ్‌మిల్‌ మీద వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వయసు మరీ పెద్దదేమీ కాదు. మంచి క్రీడాకారుడు. రోజూ జిమ్‌లో వ్యాయామం చేస్తాడు. అయినా గుండెజబ్బు ఎలా వచ్చిందని చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. నిజానికి ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు. శరీరం ఫిట్‌గా ఉన్నంతమాత్రాన గుండెజబ్బు రాకూడదనేమీ లేదు. కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బులు గలవారు ఉండటం, దీర్ఘకాలంగా ఒత్తిడి, ఇతరత్రా అంశాలూ ఆ ముప్పును తెచ్చిపెడతాయి.

సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ.. 45 ఏళ్లు దాటిన తర్వాత గుండెజబ్బు ముప్పు పెరుగుతుంది. ఇటీవలి కాలంలో మధ్యవయసు వాళ్లు మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారని, ఎక్కువకాలం జీవిస్తున్నారని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలంబియా అధ్యయనం పేర్కొంటోంది. అయితే శరీరం ఫిట్‌గా ఉన్నవారికీ గుండెజబ్బుల ముప్పు పొంచి ఉంటోందని, పైగా వీరిలో చాలామందిలో అసలు ఎలాంటి లక్షణాలు పొడసూపటం లేదని హెచ్చరిస్తోంది. అంటే కసరత్తులు చేస్తున్నా, ఆటలు ఆడుతున్నా మధ్యవయసులో క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించటం తప్పనిసరనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ గలవారికి.. కుటుంబంలో ఎవరైనా గుండెజబ్బుల గలవారికిది తప్పనిసరి. ఎందుకంటే వంశపారంపర్యంగా రకరకాల గుండెజబ్బులు సంక్రమించొచ్చు. ఒక జన్యువు లేదా కొన్ని జన్యుమార్పులతోనే కొన్ని జబ్బులు రావొచ్చు. కొందరికి వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉంటుండొచ్చు. ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు త్వరగా దెబ్బతినేలా చేస్తుంది. వాటిల్లో పూడికలు ఏర్పడేలా చేస్తుంది.

ఎందుకిలా?

వంశపారంపర్యంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండేవారిలో శరీరం అదనపు కొవ్వును బయటకు వెళ్లగొట్టలేదు. ఫలితంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరుగుతూ వస్తుంటాయి. ఇది రక్తనాళాల లోపలి గోడల్లో పోగుపడుతుంది. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పోగుపడి, పూడికలు ఏర్పడేలా చేస్తుంది. దీంతో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడుతుంది. రక్తనాళాల గోడలూ మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిపడతాయి. పూడికల సైజు పెద్దగా అవుతున్నకొద్దీ గుండెకు రక్త సరఫరా తగ్గుతూ వస్తుంది. ఇది గుండెనొప్పికి దారితీస్తుంది. గుండెపోటు ముప్పూ పెరుగుతుంది. కొన్నిసార్లు గుండెనొప్పి వంటి లక్షణాలేవీ లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటూ రావొచ్చు. వంశపారంపర్యంగా అధిక కొలెస్ట్రాల్‌ సమస్య తలెత్తటంలో ఎల్‌డీఎల్‌ఆర్‌, ఏపీఓబీ, పీసీఎస్‌కే9 జన్యువులు పాలు పంచుకుంటాయి.

చాలామందిలో ఎల్‌డీఎల్‌ఆర్‌ జన్యు మార్పులు కనిపిస్తుంటాయి. ఎల్‌డీఎల్‌ఆర్‌ జన్యువు లోడెన్సిటీ లైపోప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌) గ్రాహకం తయారుకావటానికి సంకేతాలు ఇస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) కణాలకు అంటుకుపోయి, వాటిని రక్తం నుంచి వేరుచేస్తుంది. ఇలా కొలెస్ట్రాల్‌ స్థాయులను నియంత్రించటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఎల్‌డీఎల్‌ఆర్‌ జన్యు మార్పులు గలవారిలో ఈ గ్రాహకాలు తగినంతగా ఉత్పత్తి కావు. ఇక ఇవి సరిగా పనిచేయటానికి తోడ్పడే ఏపీఓబీ, పీసీఎస్‌కే9 జన్యు మార్పులూ అధిక కొలెస్ట్రాల్‌కు దారితీస్తాయి. ఇది చిన్నవయసులోనే గుండెజబ్బులకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించటానికి స్టాటిన్‌ రకం మందులు బాగా ఉపయోగపడతాయి.  క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి, లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్ష చేయించుకోవటం ద్వారా సమస్య ముదరకుండా చూసుకోవచ్చు. 40 ఏళ్లు పైబడినవారు కనీసం ఏడాదికి ఒకసారైనా ఈ పరీక్షను చేయించుకోవటం మంచిది. ఫలితాలను బట్టి అవసరమైతే డాక్టర్లు చికిత్స సూచిస్తారు. మందులు వాడుకోవటంతో పాటు మంచి పోషకాహారం తినటం, వ్యాయామం చేయటమూ ముఖ్యమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని