Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 22 Jan 2022 20:59 IST

1. తెలంగాణలో ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు పొడిగించిన రాష్ట్ర విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

2. క్యాసినో వ్యవహారం వెనక ఉన్నదెవరు?: రఘురామ

కృష్ణాజిల్లా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్‌ హాల్‌లో క్యాసినో నిర్వహణ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని వదిలే ప్రసక్తే లేదని తెదేపా నియమించిన నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏలూరు డీఐజీ రేంజ్‌ కార్యాలయంలో కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.

TS news : అన్నదాతతో అధికారుల ఆట

3. తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు.. 2 మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,16,224 నమూనాలను పరీక్షించగా 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కి చేరింది. ఇవాళ 2,319 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రికవరీ రేటు 95.18శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 

4. ఆ రెండు ద్వీపాలనూ వదలని మహమ్మారి.. తొలిసారి లాక్‌డౌన్‌!

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా కొమ్ములు విదిలిస్తోంది. ఈ మహమ్మారితో అమెరికా, బ్రిటన్‌, భారత్‌ తదితర దేశాలు తీవ్ర పరిణామాలూ ఎదుర్కొన్నాయి. అయితే, రెండేళ్లుగా ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉన్న పసిఫిక్‌ మహాసముద్రంలోని రెండు ద్వీప దేశాలు.. కిరిబాటి, సమోమాల్లో తాజాగా తొలిసారి లాక్‌డౌన్‌ విధించడం గమనార్హం. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారిలో పెద్దఎత్తున కరోనా కేసులు వెలుగుచూడటమే ఇందుకు కారణం.

5. ఐటీ రంగంలో యువతకు22లక్షల ఉద్యోగాలు: అఖిలేశ్ హామీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే 22లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ హామీ ఇచ్చారు. శనివారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఐటీ రంగంలో యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా తమ పార్టీ కృషి చేస్తుందన్నారు.

Casino : క్యాసినో ఘటన వీడియోను బయటపెట్టిన ధూళిపాళ్ల

6. ఫ్లైట్‌ ఫైట్‌.. చైనాకు షాక్‌ ఇచ్చిన అమెరికా!

కరోనా నియంత్రణ విషయంలో ‘జీరో కొవిడ్‌’ విధానాలతో చైనా కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రయాణాలపైనా ఆంక్షలు విధిస్తోంది. ‘సర్క్యూట్‌ బ్రేకర్‌’ విధానంతో విమానాల రాకపోకలను కట్టడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికాకు చెందిన విమాన సర్వీసులను రద్దు చేసింది. అయితే, డ్రాగన్‌ చర్యకు దీటుగా.. అమెరికా సైతం ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 చైనా విమానాలను నిలిపేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

7. ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని పెంచనున్నారా?

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 11తో ముగుస్తాయి. రెండో విడత సమావేశాలు మార్చి 14న మొదలై ఏప్రిల్‌ 8 వరకు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు.

8. పాక్‌తో మ్యాచ్‌..వారిద్దరూ రాణించకపోతే భారత్‌పై ఒత్తిడి తప్పదు: హఫీజ్‌

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణించకపోతే టీమ్ఇండియాపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని పాక్ మాజీ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ పేర్కొన్నాడు. ఆసీస్‌ వేదికగా జరిగే 2022 టీ20 ప్రపంచకప్‌లో మరోసారి పాక్‌తో కలిసి భారత్ ఒకే గ్రూప్‌లో తలపడనుంది. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే.

9. భారత్‌లోనే ఐపీఎల్‌ 2022 మ్యాచ్‌లు.. కానీ..!

భారతీయ క్రికెట్ అభిమానులకు ఆనందంతోపాటు కాస్త నిరుత్సాహానికి గురి చేసే వార్త.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్ ) 2022 సీజన్‌ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరుగుతాయని సమాచారం. భారత్‌లోనే ఐపీఎల్ 2022 పోటీలు జరుగుతాయి. 

10. శిలాఫలకం ధ్వంసం.. ఆత్మకూరులో ఉద్రిక్తత

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జాతర ప్రాంగణంలో ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని ఆదేశించారు. దీంతో అక్కడే ఉన్న తెరాస నేత  మోరే మహేందర్‌ గునపంతో ధ్వంసం చేశారు. దీంతో తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని