Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 20 Jan 2022 08:57 IST

1. 5 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే..!

కరోనా చికిత్సపై ఐసీఎంఆర్‌- ఎయిమ్స్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని సూచించింది. 5 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే ఆస్పత్రిలో చేరాలని పేర్కొంది. నిమిషానికి 24 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ 90-93 శాతం మధ్యలో ఉంటే మధ్యస్థ వ్యాధి పరిగణించి కచ్చితంగా ఆస్పత్రిలో చేరాలని వెల్లడించింది.

2. మృతులు 3,993..పరిహారం దరఖాస్తులు 28,969

తెలంగాణలో అధికారికంగా నమోదైన కొవిడ్‌ మరణాల సంఖ్య కంటే ఏడింతల అధికంగా పరిహారం దరఖాస్తులు (క్లెయిములు) వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడైంది. జనవరి 16వ తేదీవరకు రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ మరణాలు 3,993 ఉండగా, క్లెయిములు 28,969 వచ్చాయి. అందులో 15,270 దరఖాస్తులను ఆమోదించి, 12,148 క్లెయిములకు చెల్లింపులు చేశారు.

3. మేడారం భక్తకోటికి సకల సౌకర్యాలు

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమవుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటిన్నర మందికి పైగా భక్తులొస్తారని ఆమె అన్నారు. 

4. రోజుకు మూడు బాల్యవివాహాలు!

రాష్ట్రంలో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడటం లేదు. బాలికల ఉన్నత విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేసినా, కల్యాణలక్ష్మి ఇస్తామని చెబుతున్నా కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా చిట్టితల్లులకు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసి, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. రాష్ట్రంలో రోజుకి సగటున మూడు చొప్పున రెండేళ్ల వ్యవధిలో 2,399 బాల్యవివాహాలను శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకున్నారు. 

5. 21న ఏపీ ఉద్యోగుల సమ్మె నోటీసు

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును... శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు. 

6. శ్రీవారి దర్శనానికి టీకా ధ్రువపత్రం తప్పనిసరి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసులు టీకా పొందినట్లు ధ్రువపత్రాన్ని లేదంటే 72 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును తీసుకొని రావాలని తితిదే ఒక ప్రకటనలో పేర్కొంది.

7. ఉద్యోగుల పరస్పర బదిలీలకు సరే

తెలంగాణలో రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చిన వినతులు, బదలాయింపుల సందర్భంగా ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యంతరాలనూ వెంటనే పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు.

8. ఫోర్డ్‌ 2 లక్షల కార్లు వెనక్కి

అమెరికాలో దాదాపు 200000 కార్లను వాహన సంస్థ ఫోర్డ్‌ వెనక్కి పిలిపిస్తోంది. బ్రేక్‌ లైట్లు ఆగిపోకుండా తలెత్తిన సమస్యను సరిచేయడానికి కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2014, 2015 ఫోర్డ్‌ ఫ్యూజన్‌, లింకన్‌, ఎంకేజడ్‌ మధ్య శ్రేణి కార్లతో పాటు 2015 మస్టాంగ్‌ మోడళ్లు ఇందులో ఉన్నాయి. డీలర్లు బ్రేక్‌, క్లచ్‌ పెడల్‌ బంపర్‌లను భర్తీ చేయనున్నారు.

9. ఐర్లాండ్‌పై యువభారత్‌ భారీ విజయం

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ దుమ్మురేపుతోంది. తొలిమ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన యువ భారత్‌ తాజాగా పసికూన ఐర్లాండ్‌ను 174 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కరోనా కలకలంతో కెప్టెన్‌ యశ్‌దుల్‌ సహా కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకున్నా.. నిశాంత్‌ సింధు నేతృత్వంలో భారత జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.

10. రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలి..కన్నా కుటుంబానికి కోర్టు ఆదేశం

ఏపీ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కన్నా విజయలక్ష్మీ, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మీ కీర్తి వేసిన గృహహింస కేసులో రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ విజయవాడ ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం న్యాయమూర్తి టాటా వెంకట శివ సూర్య ప్రకాష్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని