washing Machine: తక్కువ ధరకే వాషింగ్‌ మెషిన్లు..

వాషింగ్‌ మెషిన్లు వచ్చాక..మహిళలకు కాస్త పనిభారం తగ్గింది. అయితే ఎక్కువ ధర పెట్టి వాషింగ్‌ మెషిన్లు కొనలేని వారు మనదేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి అల్పాదాయ వర్గాల వారికోసం తక్కువ ధర ఉన్న వాషింగ్‌ మెషీన్లు భారత్‌కు రానున్నాయి.

Updated : 15 Aug 2021 05:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాషింగ్‌ మెషిన్లు వచ్చాక..మహిళలకు కాస్త పనిభారం తగ్గింది. అయితే ఎక్కువ ధర పెట్టి వాషింగ్‌ మెషిన్లు కొనలేని వారు మనదేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి అల్పాదాయ వర్గాల వారికోసం తక్కువ ధర ఉన్న వాషింగ్‌ మెషీన్లు భారత్‌కు రానున్నాయి. భారతీయ మూలాలున్న ఓ ఇంజినీర్‌ దిగువ, మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. లండన్‌లో జన్మించిన నవజ్యోత్ సాహ్నీ అనే భారతీయ విద్యార్థి మూడేళ్ల క్రితం తక్కువ ఆదాయ వర్గాలకు కూడా వాషింగ్‌ మెషీన్‌ ఉండాలనే ఉద్దేశంతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. దీన్ని స్వచ్ఛంద సేవకులు, భాగస్వాములతో కలిసి ఇరాక్‌లోని రెఫ్యూజీ క్యాంప్‌లో ఏర్పాటు చేయనున్నారు.

ఆలోచన ఎలా పుట్టిందంటే..?

తక్కువ ధర ఉన్న వాషింగ్‌ మెషీన్లు సరఫరా చేయాలనే ఆలోచన స్నేహితుల నుంచే పుట్టిందట. సంస్థ వ్యవస్థాపకుడు నవ్‌జ్యోత్‌ ఒకరోజు తన స్నేహితురాలు దివ్యను కలవడానికి తన ఇంటికి వెళ్లాడు. అక్కడ తను ఇంటి పనులు చేస్తుంటే చూసి చలించిపోయాడు. మసి పట్టిన గ్యాస్‌ స్టౌవ్‌ను శుభ్రం చేయడం చూశాడు. ఆమె బట్టలు ఉతుకుతున్న తీరును చూసి మహిళలకు ఇంట్లో పనిభారం ఎక్కువ ఉంటుందని..దానికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అలా తక్కువ ధర ఉన్న వాషింగ్‌ మెషీన్‌ను అందించాలనే ఐడియాతో వీటిని సరఫరా చేయనున్నారు.

ఏటా 750 గంటలు ఆదా..

ఆఫ్‌లోడ్‌, మాన్యువల్‌ వాషింగ్ మెషిన్ ప్రాజెక్ట్‌ ద్వారా 60-70 శాతం సమయాన్ని ఆదా చేయవచ్చు. అలాగే 50 శాతం నీటిని కూడా సేవ్‌ చేసేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేశారు. దీని తయారీకి ఇంట్లోని వంటగదిలో సాధారణంగా ఉపయోగించే సలాడ్‌ స్పిన్నర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. తర్వాత నవజ్యోత్‌ తన స్నేహితురాలు పేరుమీదనే ‘దివ్య 1.5’ మోడల్‌తో  మొదటి దాన్ని రూపొందించాడు. ప్రస్తుతం దివ్య 1.5ను స్వచ్ఛంద సంస్థ కేర్ ఇంటర్నేషనల్ సహాయంతో ఇరాక్‌లోని మమ్రాషన్ శరణార్థుల శిబిరంలో 30 వాషింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది 300 మంది లాండ్రీ అవసరాలు తీర్చవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కో ఇంటికి 750 పనిగంటల వరకు ఆదా చేయవచ్చని భావిస్తున్నారు. ఇది రెండు నెలల పగటి సమయానికి సమానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ యంత్రాల పంపిణీకి నవజ్యోత్‌  సెప్టెంబర్‌లో ఇరాక్ వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది తర్వాత వీటిని జోర్డాన్‌ క్యాంప్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఇండియా, ఆఫ్రికా దేశాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని