రైల్వేమన్‌.. నీ సాహసానికి సలాం..

ఒక్క సెకను ఆలస్యమైతే ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేది. కానీ ఓ రైల్వేమన్‌ బాలుడిని ఆపద్బాంధవుడిలా కాపాడాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి....

Updated : 19 Apr 2021 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్క సెకను ఆలస్యమైతే ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేది. కానీ ఓ రైల్వేమన్‌ బాలుడిని ఆపద్బాంధవుడిలా కాపాడాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. నిర్మానుష్యంగా ఉన్న ముంబయిలోని వెంగని రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఓ బాలుడు, బాలిక నడుచుకుంటూ వెళుతున్నారు. అంతలోనే ఆ బాలుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. అప్పటికే ఆ పట్టాలపై ఓ రైలు వేగంగా వస్తూ ఉంది. దీంతో ఆ బాలిక గట్టిగా అరుస్తూ బాలుడిని పైకి రావాలంటూ కోరుతోంది. ఇది గమనించిన మయూర్‌ షెల్కే అనే రైల్వేమన్‌ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. పట్టాలపై నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి చాకచక్యంగా బాలుడిని ప్లాట్‌ఫామ్‌ ఎక్కించి, వెంటనే అతడు కూడా పైకెక్కాడు. సెకను ఆలస్యమైతే ఆ బాలుడిని రైలు ఢీ కొట్టేదే. రెప్పపాటులో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమేరాల్లో రికార్డ్‌ అయ్యాయి. రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. బాలుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన మయూర్‌ షెల్కే అంటే గర్వంగా ఉందని ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని