సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు 

ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారి ఏర్పాటు చేసిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక  వెస్టర్న్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ అండ్‌ కాలేజెస్‌.....

Published : 14 Jul 2021 20:48 IST

కాలిఫోర్నియా: ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారి ఏర్పాటు చేసిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక వెస్టర్న్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ అండ్‌ కాలేజెస్‌ (WASC) గుర్తింపు లభించింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో భారతీయులతో తొలిసారి స్థాపించిన ఈ విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు లభించడం విశేషం. కాలిఫోర్నియాలో ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కెలీ, లాస్ ఏంజెల్స్‌ విశ్వవిద్యాలయాలకు సైతం ఇదే గుర్తింపు ఉంది.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు లభించిన శుభసందర్భంలో వర్సిటీ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడారు. భారతీయ భాషలకు, కళలకు అంతర్జాతీయ స్థాయిలో పట్టం కట్టడంతో పాటు ప్రతిభ కలిగిన విద్యార్థులకు బోధించేందుకు ఈ గుర్తింపు ఎంతో అవసరమన్నారు. ఈ అపూర్వ ఘట్టాన్ని అందరితోనూ పంచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. విశ్వవిద్యాలయం మరిన్ని భారతీయ కళలు, భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేసేందుకు ఈ గుర్తింపు మరింతగా సహకరిస్తుందని ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, ఆచార్య పప్పు వేణుగోపాలరావు అన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతోందని చెప్పేందుకు ఈ గుర్తింపే తొలి మెట్టు అని విశ్వద్యాలయ ప్రొవోస్ట్, చీఫ్ అకడెమిక్‌ ఆఫీసర్ చామర్తి రాజు అన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆర్థిక, పరిపాలనా విభాగం వైస్ ప్రెసిడెంట్, కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ.. WASC గుర్తింపు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎన్నో బాటలు వేస్తుందని పేర్కొంటూ తన హర్షం ప్రకటించారు. 

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించారు. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధనను ప్రారంభించింది. ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు, సంస్కృత భాషా విభాగాలు ఉన్నాయి. డిప్లమో మొదలుకొని మాస్టర్స్ డిగ్రీల వరకు విద్యాబోధన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు https://www.universityofsiliconandhra.org/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ఫణి మాధవ్ కస్తూరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని