Black Friday: ఈ ‘బ్లాక్‌ ప్రైడే’ వెనుక ఇంత కథ ఉందా..?

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ బ్లాక్‌ ప్రకారం ‘బ్లాక్‌ ఫ్రైడే’ అనే పదం 1610లో పరిశోధకుల కంట పడిందట. వీళ్ల అధ్యయనం ప్రకారం..

Published : 27 Nov 2021 01:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టాక్‌ మార్కెట్‌ను ఫాలో అయ్యేవారు... అప్పుడప్పుడు ‘బ్లాక్‌ ఫ్రైడే’ అనే పదం వింటుంటారు. శుక్రవారంనాడు ఆ వారం మార్కెట్ల ట్రేడింగ్‌ క్లోజ్‌ అవుతుంది. ఆ రోజు మార్కెట్లు భారీగా నష్టపోతే... బ్లాక్‌ ఫ్రైడే అంటుంటారు. ఈ రోజు (26/11/21) కూడా ఇదే జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,687 పాయింట్లు, నిఫ్టీ 509 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపరులకు నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో ‘బ్లాక్‌ ఫ్రైడే’ అంటే ఏంటి? ఎందుకు ఈ పదం వాడుతున్నారు? అసలు ఈ పదం వాడుకలోకి ఎలా వచ్చిందో చూద్దాం!

సేల్‌ ప్రమోషన్‌ కోసమే...

అమెరికా (US)లో థ్యాంక్స్‌ గివింగ్‌ డే తర్వాత వచ్చే మరుసటి రోజునే ‘బ్లాక్‌ ఫ్రైడే’ అని పిలుస్తారు. ‘బ్లాక్‌ ఫ్రైడే’ రోజు అక్కడి అన్ని దుకాణాలల్లో ఉత్పత్తులను వినియోగదారులకు భారీ, ఆకర్షణీయ డిస్కౌంట్‌లకు ఇస్తుంటారు. దీని కోసం దుకాణాలన్నింటినీ ముందుగానే తెరిచి అర్ధరాత్రి వరకూ విక్రయాలు కొనసాగిస్తారు. షాపింగ్‌ పోర్టల్‌లోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఏటా నవంబర్‌ నాలుగో గురువారమే థ్యాంక్స్‌ గివింగ్‌ డే (పబ్లిక్‌ హాలిడే). ఆ మరుసటికి రోజు బ్లాక్‌ ఫ్రైడే అన్నమాట. 

కార్నర్‌ చేసిన రోజు...

బ్లాక్‌ ఫ్రైడేను ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక సందర్భాల్లో ఈ సంప్రదాయన్ని వ్యాపారులు వాడుతుంటారు. అధిక వినియోగాన్ని ప్రోత్సహించే ఈ సేల్‌ ప్రమోషన్‌ను ఇప్పటికీ పలువురు నిందిస్తుంటారు. 1869 నాటి శుక్రవారం రోజు యూఎస్‌ బంగారం మార్కెట్‌ భారీగా పతనమైందట. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో బంగారం మార్కెట్‌ను కార్నర్‌ చేయడానికి ప్రయత్నించడంతో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. ఆ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొన్నేళ్లు ఉంది. మార్కెట్‌ క్రాష్‌ అయిన ఆ రోజును ‘బ్లాక్‌ ఫ్రైడే’ లేదా చీకటి రోజుగా ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు. 

చుక్కలు చూపించిన రోజు...

బ్లాక్‌ ఫ్రైడే విషయంలో మరో వాదన కూడా ఉంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 1960లో థ్యాంక్స్‌ గివింగ్‌ డే తర్వాతి రోజు (ప్రీ-క్రిస్మస్‌ షాపింగ్‌లో) రోడ్లన్నీ రద్దీగా మారాయట. ఆ భారీ ట్రాఫిక్‌ జామ్‌ అక్కడి పోలీసులకు చుక్కలు చూపించడంతో ఆ రోజునూ వారు బ్లాక్ ఫ్రైడేగా అభివర్ణించారట. ఇక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ బ్లాక్‌ ప్రకారం 1610లోనే ఈ పదం పరిశోధకుల కంట పడిందట. వీళ్ల పరిశోధన ప్రకారం బ్లాక్‌ ఫ్రైడేకు అమ్మకాలకు సంబంధం లేదు. ఏదైనా శుక్రవారానికి కాలం పరీక్ష పెడితే ఆ రోజును బ్లాక్ ఫ్రైడేగా వాడతారని పేర్కొంది. అలా బయటకు వచ్చిన బ్లాక్‌ ఫ్రైడే పదాన్ని... మన స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాలు చవిచూసినప్పుడు వాడుతున్నాం అన్నమాట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు