మోచేతిపై దెబ్బ..జివ్వుమంటుంది ఎందుకు?

శరీరంపై ఎక్కడ దెబ్బ తగిలినా కాస్త బరించగలమేమో గానీ, మోచేతి కీలుపై తగిలితే మాత్రం ఒక్కసారిగా జివ్వు మంటుంది. వేళ్ల చివరి నుంచి మెదడు వరకు కరెంట్‌ షాక్‌ కొట్టినట్లవుతుంది...

Published : 15 Aug 2021 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శరీరంపై ఎక్కడ దెబ్బ తగిలినా కాస్త భరించగలమేమో గానీ, మోచేతి కీలుపై తగిలితే మాత్రం ఒక్కసారిగా జివ్వుమంటుంది. వేళ్ల చివరి నుంచి మెదడు వరకు కరెంట్‌ షాక్‌ కొట్టినట్లవుతుంది. కొద్ది సేపటి వరకు స్పర్శ కూడా తెలీదు. అసలు ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?

మోచేతిపై దెబ్బ తగిలితే సాధారణంగా ఎముకపై తగిలింది అనుకుంటారు. కానీ, దెబ్బ తగిలింది ఎముకకు కాదు.. నరానికి. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మన శరీరీరంలో ఎన్నో నరాలు ఉంటాయి. ఇవన్నీ మెదడు నుంచి శరీరంలోని వివిధ భాగాలకు అనుసంధానించి ఉంటాయి.  శరీరభాగాల నుంచి సమాచారాన్ని మెదడుకు, అక్కడి నుంచి ఆదేశాలను శరీర అవయవాలకు చేరవేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ప్రతి నరానికి ఎముకగానీ, కండరాలుగానీ రక్షణ ఇస్తాయి. అంటే వాటిని ఆనుకుంటూ నాడీ వ్యవస్థ నిర్మితమై ఉంటుంది. కానీ, మోచేతి కీలు దగ్గర మాత్రం నరం బయటకు ఉంటుంది. దానిపై చర్మం మాత్రమే కప్పి ఉంటుంది. ఈ నరాన్నే ‘అల్నార్‌ నరం’ అంటారు.

అల్నార్‌ నరం.. చిటికెన, ఉంగరపు వేళ్ల చివరి భాగం నుంచి వెన్నెముక, మెడ మీదుగా మెదడు వరకు వ్యాపించి ఉంటుంది. మోచేతి కీలువద్ద నరానికి స్వల్ప రక్షణే ఉండటం వల్ల దెబ్బతగిలినప్పుడు అది నేరుగా నరంపై ప్రభావం చూపిస్తుంది. ఎముక ఉపరితలానికి, ఢీ కొట్టిన వస్తువుకు మధ్య నరం ఇరుక్కుపోయి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయి.. కరెంట్‌ షాక్‌ తగిలినట్లు జివ్వుమంటూ స్పర్శ కోల్పోతాము. కొన్నిసార్లు కళ్లు బైర్లు కమ్మినట్లువుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని