Mobiles : మొబైల్‌కు బానిసై.. మానసిక రోగిగా మారి..!

నేటి యువత మొబైల్‌ ఫోన్లకు బానిసలవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా, తెలియకుండానే తిండి, నిద్ర మానేసి చరవాణిని ఓ వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్‌ వినియోగానికి అతిగా అలవాటు పడిన ఓ యువకుడు చివరికి..

Published : 29 Nov 2021 01:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటి యువత మొబైల్‌ ఫోన్లకు బానిసలవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షణం తీరిక లేకుండా, తెలియకుండానే తిండి, నిద్ర మానేసి చరవాణిని ఓ వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. మొబైల్‌ వినియోగానికి అతిగా అలవాటు పడిన ఓ యువకుడు చివరికి మానసిక రోగిలా మారిపోయిన సంఘటన రాజస్థాన్‌లో జరిగింది.సెల్‌ఫోన్లు మానవసంబంధాలను దూరం చేస్తాయనడానికి ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం.

కొంతమంది పక్కవారితో సంబంధం లేకుండా.. గంటలకు గంటలు ఫోన్‌తోనే కాలం వెళ్లదీస్తుంటారు. రాజస్థాన్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మొబైల్‌కు బానిసైన ఓ యువకుడు చివరికి మానసిక రోగిలా మారిపోయి, బంధువులనే గుర్తుపట్టలేని స్థితికి వెళ్లాడంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్‌లోని చురూ ప్రాంతానికి చెందిన అక్రమ్‌కు ఫోన్‌ అలవాటు ఎక్కువగా ఉండేది. మొబైల్‌ వినియోగిస్తూ రాత్రిళ్లు నిద్ర కూడా మానేసేవాడు.రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్‌ చూస్తూనే ఉంటాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా అక్రమ్‌ వింతగా ప్రవర్తించడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు నిద్ర లేకపోవడం కారణంగా మానసిక రోగిగా మారాడని, అతడి ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. ప్రస్తుతం అక్రమ్‌కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స సమయంలోనూ ఫోన్‌ కావాలని అడుగుతున్నాడని వైద్యులు చెబుతున్నారు.

అక్రమ్‌కు 8 నెలల క్రితం నిశ్చితార్ధమైంది.ఎప్పుడూ ఫోన్‌ చూస్తూ ఉండటంతో తల్లిదండ్రులు అడిగితే తనకు కాబోయే భార్యతో చాట్‌ చేస్తున్నాననేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏమీ తినకుండా, తాగకుండా గంటల తరబడి ఫోన్‌ చూసేవాడని చెప్పారు. ఇప్పుడు తమను కూడా గుర్తు పట్టడంలేదని, ఆహారం కూడా తీసుకోవడం లేదని అన్నారు. అక్రమ్‌ వింత చేష్టలకు ఒక్కోసారి భయభ్రాంతులకు గురయ్యామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని