Amit Shah: ‘చర్చలంటూ జరిగితే కశ్మీర్‌వాసులతోనే.. పాక్‌తో కాదు’

జమ్మూ-కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్‌తో చర్చలు జరపాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీటుగా స్పందించారు. మూడు రోజుల కశ్మీర్‌ పర్యటనలో ఉన్న షా చివరి రోజు సోమవారం...

Published : 25 Oct 2021 22:11 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్‌తో చర్చలు జరపాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన తాజా వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీటుగా స్పందించారు. మూడు రోజుల కశ్మీర్‌ పర్యటనలో ఉన్న షా చివరి రోజు సోమవారం శ్రీనగర్‌లో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ.. ‘పాక్‌తో భారత ప్రభుత్వం తప్పనిసరిగా చర్చలు జరపాలంటూ ఫరూక్‌ సలహా ఇచ్చారని వార్తాపత్రికల్లో చూశా. ఆయన అనుభవం ఉన్న వ్యక్తి. ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడ. ఇదీ ఆయన సలహా. కానీ, ఫరూక్‌తోపాటు మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ చర్చలంటూ జరిగితే.. అది కశ్మీర్‌వాసులతోనే, ఇక్కడి యువతతోనే’ అని షా స్పష్టం చేశారు. అందుకే స్థానికుల ముందు స్నేహ హస్తం చాచుతున్నట్లు తెలిపారు. 

నా ముందు బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్ కూడ లేదు..

‘నన్ను కొందరు తిట్టారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ.. నేను మీ ముందు బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నా. అందుకే.. నా ముందు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేదు. సెక్యూరిటీ కూడా లేదు’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన.. కశ్మీర్‌ గందర్‌బల్ జిల్లాలోని భవానిమాత ఆలయాన్ని సందర్శించారు. స్థానిక లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో తదితరులు ఆయన వెంట ఉన్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం మొదటిసారి కశ్మీర్‌లో పర్యటిస్తున్న అమిత్‌ షా.. స్థానికంగా ఉగ్రవాదం కట్టడి, యువతకు ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు.. ఆ తర్వాతే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామంటూ స్పష్టం చేశారు. కశ్మీర్‌లో ప్రారంభమైన అభివృద్ధిని ఎవరూ ఆపలేరని, శాంతి, సామరస్యాలను దెబ్బతీసేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని