Afghanisthan: ధైర్యంగా ఉద్యోగంలో చేరిన అఫ్గాన్‌ మహిళలు!

తాలిబన్లు అఫ్గాన్‌ను తమ కబందహస్తాల్లోకి తీసుకున్న నెలలోపే ఓ మహిళ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది

Published : 13 Sep 2021 01:30 IST

కాబుల్‌: తాలిబన్లు అఫ్గాన్‌ను తమ కబంధహస్తాల్లోకి తీసుకున్న నెలలోపే ఓ మహిళ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. మహిళలపై తాలిబన్లు ఎంత క్రూరంగా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. అయినా, ఓ మహిళ ధైర్యం చేసి కాబుల్‌ విమానాశ్రయంలో పని చేయడానికి నిశ్చయించుకుంది. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం మహిళలు ఇంట్లోనే ఉంటేనే వారికి పూర్తి రక్షణగా భావిస్తారు. కానీ, ముగ్గురి బిడ్డలకు తల్లి అయినా రబియా జమాల్ (35) ఎంతో ధైర్యం చేసి తిరిగి ఉద్యోగంలో చేరారు. తాజాగా కాబుల్‌ విమానాశ్రయంలో మహిళా సిబ్బంది పనిచేయడాన్ని ఓ వార్తా సంస్థ గుర్తించింది. అందులో రబియా జమాల్‌ కూడా ఉన్నారు. ఆమె 2010 నుంచి విమానాశ్రయంలో పనిచేస్తున్నారు.

‘‘నా కుటుంబాన్ని పోషించుకోవటానికి నాకు డబ్బు కావాలి. ఇంట్లో ఉంటే చాలా ఒత్తిడికి గురయ్యాను. చాలా బాధగా అనిపించింది. ఉద్యోగంలో చేరాక కొంచెం ప్రశాంతంగా ఉంది’’ అని రబియా పేర్కొంది.
 

80 మహిళలకు 12 మంది మాత్రమే..

కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోక ముందు విమానాశ్రయంలో 80కి పైగా మంది మహిళలు పనిచేసేవారు. అందులో 12 మంది మాత్రమే తిరిగి ఉద్యోగంలో చేరడానికి వచ్చారు. మహిళలు ఉద్యోగంలో చేరడానికి తాలిబన్లు అనుమతిచ్చిన అతి కొద్ది మంది మహిళలలో వీరు ఉన్నారు. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు ఉద్యోగంలో తిరిగి చేరొద్దని తాలిబన్లు చాలా మందికి తేల్చి చెప్పారు. విమానంలో ప్రయాణించే మహిళా ప్రయాణికులను స్కాన్ చేసి పంపించడానికి ఆరుగురు మహిళా సిబ్బంది ఎయిర్‌పోర్టు ప్రధాన ద్వారం వద్ద నిలబడి నవ్వుతూ కనిపించారని ఓ వార్త సంస్థ పేర్కొంది.
ఇందులో రబియా జమాల్ సోదరి కుద్సియా జమాల్ (49) కూడా ఉన్నారు. ‘‘కాబుల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో షాక్‌కు గురయ్యాను. తర్వాత ఏం జరుగుతుందోనని చాలా భయం వేసింది. ఉద్యోగంలో చేరుతున్నానంటే నా కుటుంబ సభ్యులు చాలా భయపడ్డారు. ఉద్యోగానికి వెళ్లొద్దని చెప్పారు. కానీ, నేను వారి మాట వినకుండా వచ్చాను. ఉద్యోగంలో చేరడంతో ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు లేవు’’ అని కుద్సియా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని