Omicron: దిల్లీ ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి 12 ఒమిక్రాన్‌ అనుమానిత కేసులు

దిల్లీలోని లోక్‌ నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్‌ అనుమానిత బాధితులు చేరారు. వీరిలో 8 మంది నిన్ననే ఆసుపత్రికి రాగా.. మరో నలుగురు నేడు వచ్చి చేరారు.

Published : 03 Dec 2021 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో 12 మంది ఒమిక్రాన్‌ అనుమానిత బాధితులు చేరారు. వీరిలో 8 మంది నిన్ననే ఆస్పత్రికి రాగా.. మరో నలుగురు నేడు చేరారు. నేడు వచ్చిన వారిలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. వీరిలో యూకే నుంచి ఇద్దరు,  ఫ్రాన్స్‌ నుంచి ఒకరు, నెదర్లాండ్స్‌ నుంచి మరొకరు వచ్చినట్లు తెలిసింది. వీరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపనున్నారు.

ఇప్పటికే ‘ఒమిక్రాన్’ భారత్‌లోనూ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్‌ కేసుల్ని కర్ణాటకలో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో ఆఫ్రికా నుంచి వచ్చినవారు ఒకరు కాగా.. మరొకరు కర్ణాటకకు చెందినవారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన చేసింది. ‘‘ ఒమిక్రాన్‌ లక్షణాలను బట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించవచ్చు. రానున్న  రోజుల్లో మరికొన్ని కొత్త కేసులు భారత్‌లో బయటపడవచ్చు. ఇప్పటికే వేగంగా వ్యాక్సినేషన్‌ జరగడంతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. టీకాలు సక్రమంగా పనిచేయవంటూ ఎటువంటి పరిశోధనా ఫలితాలు వెల్లడి కాలేదు. ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోవాలి’’ అని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని