ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు కేసు: నలుగురి అరెస్టు

ఈ ఏడాది జనవరిలో దిల్లీలోని ఇజ్రాయెల్‌ ఎంబీసీ వద్ద చోటు చేసుకొన్న పేలుడు కేసులో నలుగురు అనుమానితులను దిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం

Published : 25 Jun 2021 20:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది జనవరిలో దిల్లీలోని ఇజ్రాయెల్‌ ఎంబీసీ వద్ద చోటుచేసుకున్న పేలుడు కేసులో నలుగురు అనుమానితులను దిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం జమ్ము-కశ్మీర్‌లో అరెస్టు చేసింది. కార్గిల్‌ జిల్లాకు చెందిన వీరు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. వీరికి ఈ పేలుడు కేసుతో సంబంధం ఉన్నట్లు ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించారు. దీనిపై దిల్లీ పోలీసుల ప్రతినిధి చిన్మయ్‌ బిస్వాల్‌ మాట్లాడుతూ .. అరెస్టైన వారిని నజీర్‌ హుస్సేన్‌, జుల్ఫీకర్‌ ఆలీ వాజీర్‌, అయాజ్‌ హుస్సేన్‌, ముజమ్మిల్‌ హుస్సేన్‌లుగా గుర్తించారు. వీరంతా థాంగ్‌ గ్రామానికి చెందిన వారు. వీరిని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై దిల్లీకి తరలించారు. పేలుడు జరిగిన రోజున వీరంతా దిల్లీలోనే ఉన్నట్లు గుర్తించారు. కానీ, వీరి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.

జనవరి 29న దిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయానికి 150 మీటర్ల దూరంలో స్వల్ప బాంబు పేలుడు ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.  అయితే ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు దాడికి కుట్ర పన్నిన ఇద్దరు వ్యక్తులను సీసీ ఫుటేజీ ద్వారా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. వారిని గుర్తించి వివరాలు చెప్పిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజుల్లోనే అనుమానితులను అరెస్టు చేయడం విశేషం.

తొలుత ఈ కేసును దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం దర్యాప్తు చేసింది. అనంతరం ఫిబ్రవరిలో ఈ కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ నాటి ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకొని శిక్షిస్తామని స్పష్టంచేశారు. భారత్‌-ఇజ్రాయెల్‌ దౌత్యసంబంధాలు ఏర్పాటు చేసుకొని 29 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ పేలుడు చోటు చేసుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు