Union Cabinet: మోదీ జట్టులో నలుగురు వైద్యులే!

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్‌ బుధవారం కొలువుదీరింది. అయితే అందులో నలుగురు వైద్యులు కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Updated : 07 Jul 2021 21:57 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్‌ బుధవారం కొలువుదీరింది. అయితే, అందులో నలుగురు వైద్యులు కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దేశంలో కొవిడ్‌ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం పెంచేందుకు తన కొత్త జట్టులోకి నలుగురు వైద్యులను మోదీ తీసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. కొత్తగా మోదీ జట్టులో స్థానం దక్కించుకున్న ఆ నలుగురి గురించి సంక్షిప్తంగా..!

డా.సుభాశ్‌ సర్కార్‌: 


డా.సుభాశ్‌ సర్కార్ (68) పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నుంచి భాజపా తరఫున 2019 ఎన్నికల్లో లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన బీఎస్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. భాజపాలో పలు పదవులు నిర్వహిస్తూనే 28 ఏళ్ళుగా గైనకాలజిస్టుగానూ సేవలందిస్తున్నారు. శాస్త్ర, సామాజిక అంశాలకు సంబంధించిన పలు సెమినార్లకు అధ్యక్షత వహించారు.

డా.భారతి ప్రవీణ్‌ పవార్‌:


మహారాష్ట్రకు చెందిన డా.భారతి ప్రవీణ్‌ పవార్ నాసిక్‌లోని డిండోరి నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఎంపీగా గెలుపొందారు. ఆమె పుణె విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్‌డీఎమ్‌వీపీ మెడికల్‌ కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ డిగ్రీ పొందారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాసిక్‌ జిల్లా పరిధిలో పోషకాహార లోపం, తాగునీటి సమస్యలపై ఆమె విస్తృత పోరాటం చేశారు.

డా.భగవత్‌ కిషన్‌రావ్‌ కారాడ్‌:


మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన డా.భాగవత్‌ కిషన్‌రావ్‌ కారాడ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఔరంగాబాద్‌ నగరానికి రెండు పర్యాయాలు మేయర్‌గానూ పనిచేశారు. చిన్నపిల్ల్లల వైద్య నిపుణుడిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఔరంగాబాద్‌లో కారాడ్‌ ఆసుపత్రిని ఆయన నిర్వహిస్తున్నారు. 

డాక్టర్‌ ముంజపర మహేంద్రభాయ్‌:


డా. ముంజప మహేంద్ర భాయ్‌ (52) గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. విద్యార్థి దశలో వ్యవసాయ కూలీగా పని చేసిన ఆయన.. బంధువులు, స్నేహితుల సహకారంతో అహ్మదాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఇప్పటికీ పేదల కోసం వైద్య శిబిరాలను నిర్వహిస్తుంటారు. ఆయన గతంలో రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్‌ ఛాంపియన్‌గానూ గుర్తింపు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని