Black fungus: 40 వేలు దాటేసిన కేసులు

కరోనా అనంతరం అనేకమందిలో బయటపడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు....

Updated : 28 Jun 2021 18:40 IST

దిల్లీ: కరోనా అనంతరం అనేకమందిలో బయటపడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 40,845 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ వెల్లడించారు. వీరిలో 3,129మంది మృతిచెందినట్టు తెలిపారు. సోమవారం మంత్రుల బృందం 29వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితి, వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌ సహా పలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినవారిలో 13,083 మంది (32శాతం) 18 నుంచి 45 ఏళ్లు లోపువారేనని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే, 17,464 (42శాతం) మంది 45 నుంచి 60 ఏళ్ల లోపువారు కాగా.. 10,082 (24శాతం) మంది 60 ఏళ్లు దాటినవారు ఉన్నట్టు పేర్కొంది. ఈ సమావేశంలో ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ మాట్లాడుతూ.. దేశంలో సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి ఇంకా తగ్గలేదన్నారు. ఇప్పటికే 80 జిల్లాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్టు హెచ్చరించారు. వ్యాక్సిన్లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సమర్థంగానే పనిచేస్తున్నట్టు గుర్తించామన్నారు.

దేశంలో కరోనా వైరస్‌ గమనంపై జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజిత్‌ కుమార్‌ సింగ్ వివరమైన నివేదికను సమర్పించారని ఆరోగ్యశాఖ తెలిపింది. యాక్టివ్‌ కేసులు ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఒడిశాలలో ఉన్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని