covid19: కాలేజ్‌ ఈవెంట్‌.. 66 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్‌..!

కొవిడ్‌ మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలేలా లేదు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లోని ఒక మెడికల్‌ కళాశాలలో 66 మంది వైద్య విద్యవిద్యార్థులకు కరోనా సోకింది.

Published : 26 Nov 2021 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలేలా లేదు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లోని ఒక మెడికల్‌ కళాశాలలో 66 మంది వైద్యవిద్యార్థులకు కరోనా సోకింది. వీరంతా కరోనా టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం విశేషం. ఈ విషయాన్ని నేడు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.  జిల్లాలోని ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో మొత్తం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మంది పాజిటీవ్‌గా తేలింది. విద్యార్థులు ఇటీవలే ఒక కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీరికి వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

సమాచారం తెలుసుకొన్న అధికారులు వెంటనే ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసివేశారు. ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. ఇప్పటికే విద్యార్థులు అంతా టీకాలు తీసుకోవడంతో వారిని క్వారెంటైన్‌లో ఉంచినట్లు ధార్వాడ్‌ డిప్యూటీ కమిషనర్‌ నితేష్‌ పాటిల్‌ తెలిపారు. ‘‘మిగిలిన  100 మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాము. రెండు హాస్టళ్లను సీల్‌ చేశాము. విద్యార్థులకు అవసరమైన చికిత్స, ఆహారాన్ని అందిస్తున్నాము. ఎవరినీ అడుగు బయటపెట్టనీయడంలేదు. ఇప్పటికీ పరీక్షలు చేయించుకోని విద్యార్థులను వేరే చోట క్వారెంటైన్‌లో ఉంచాము. కళాశాలలో ఇటీవల ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అందరినీ పరీక్షించాము. మేము వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించేపనిలో ఉన్నాము’’ అని పాటిల్‌ పేర్కొన్నారు. 

ఒడిశా వైద్య కళాశాలలో 54 మందికి పాజిటివ్‌..

ఒడిశాలోని విమ్సార్‌కు చెందిన వైద్య కళాశాలలో కరోనా సోకిన  విద్యార్థుల సంఖ్య 54కు చేరింది. వైరస్ బారినపడిన విద్యార్థులు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు. ఈ రెండు ఘటనలకు ఇటీవల కళాశాలల్లో నిర్వహంచిన కార్యక్రమాలే కారణంగా అధికారులు భావిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని