భారత అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధం

భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ తాజాగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ టౌడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టం (ఏటీఏజీఎస్‌) అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు....

Published : 20 Dec 2020 01:45 IST

48 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగల తుపాకీ తయారీ

భువనేశ్వర్‌: సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ తాజాగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ టౌడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టం (ఏటీఏజీఎస్‌) అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలో ఈ పరీక్షలు జరిపారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం సులువుగా ఛేదించేలా ఏటీఏజీఎస్ తుపాకీని తయారు చేశారు. 

డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు 2016లో ఏటీఎజీఎస్‌ తుపాకుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. డీఆర్‌డీఓతోపాటు భారత్‌ ఫోర్జ్‌ టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌తో కలిసి ఈ తుపాకిని అభివృద్ధి చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ ఆయుధాన్ని దేశీయంగా అభివృద్ధి చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలేంద్ర తెలిపారు. అంతర్జాతీయస్థాయి ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మన దేశానికి లేదన్నారు.
ఇప్పటికే ఏటీఏజీఎస్‌ తుపాకులను డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు సరిహద్దుల్లో పరీక్షించారు.  చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వద్ద ఇప్పటికే పరీక్షలు జరిపారు. ఈ తరహా తుపాకులు నిమిషానికి మూడు రౌండ్ల కాల్పులు మాత్రమే జరిపితే ఏటీఏజీఎస్‌ మాత్రం నిమిషానికి ఐదు రౌండ్ల కాల్పులు జరుపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా తుపాకులు భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి...

బలగాల ఉపసంహరణకు.. ప్రయత్నాలు కొనసాగిద్దాం

గగనతలంలో నిఘా నేత్రాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని