బీజింగ్‌లో ఇక మాస్కులు అక్కరలేదట..!

వైరస్‌కు మూలకారణమైన చైనాలో మాత్రం నిబంధనలు సడలిస్తుండడం విశేషం. తాజాగా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కులపై ఉన్న నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

Published : 22 Aug 2020 01:32 IST

నిబంధనలు సడలించిన అధికారులు
వైరస్‌ తగ్గుముఖం పట్టడంతోనే ఈ నిర్ణయమని వెల్లడి

బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఆయా దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ ముప్పు ఇప్పుడే తొలగిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అంతర్జాతీయంగా ఉన్న నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడంతోపాటు, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో.. వైరస్‌కు మూలకారణమైన చైనాలో మాత్రం నిబంధనలు సడలిస్తుండడం గమనార్హం. తాజాగా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కులపై ఉన్న నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. చైనా రాజధాని బీజింగ్‌లో మాస్కులు లేకుండానే ప్రజలు బయట తిరగవచ్చని అధికారులు వెల్లడించారు.

మాస్కులపై ఉన్న నిబంధనలను బీజింగ్‌ అధికారులు తొలగించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ నెలలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గడంతో మాస్కులు లేకుండా ప్రజలు బయటకు వెళ్లవచ్చని తొలిసారి ప్రకటించారు. అనంతరం మూడు నెలల తర్వాత ఓ హోల్‌సేల్‌ మార్కెట్‌ వైరస్‌వ్యాప్తికి కేంద్రంగా మారడంతో మాస్కులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా గడిచిన 13రోజుల నుంచి చైనా రాజధాని బీజింగ్‌లో కొత్తగా ఒక్కకేసు కూడా నమోదుకాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మాస్కులు అవసరం లేదని చెప్పినప్పటికీ ప్రజల మాస్కులతోనే బయటకు వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. మాస్కులు ధరించడం రక్షణగా ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం ఇతరుల ఒత్తిడితోనే మాస్కు ధరిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఇప్పటివరకు 89,000కేసులు నమోదుకాగా 4700 మరణాలు సంభవించాయి. 31 దేశాల్లో కేసుల సంఖ్య చైనాకన్నా అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2కోట్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా, 7లక్షల 90వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని