
బైడెన్ మాట నిలబెట్టుకునేనా?
వాషింగ్టన్: దాదాపు నాలుగు రోజులపాటు ప్రపంచం ఉత్కంఠగా నిరీక్షించిన తర్వాత డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్నట్లు తేలింది. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నాప్పటికీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270ని దాటేసిన బైడెన్.. 290 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డెమొక్రాట్ల మేనిఫెస్టో (పాలసీ పేపర్)ని బట్టి భారత్- అమెరికా సంబంధాలు ఎలా ఉంటాయనేది ఒకసారి పరిశీలిస్తే!
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు పుంజుకున్న మాట వాస్తవం. ఇటీవలే దేశ రక్షణకు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. మరోవైపు జో బైడెన్ విడుదల చేసిన పాలసీ పేపర్ ప్రకారం భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌ను శాశ్వత ప్రతినిధిగా చేర్చేందుకు అమెరికా మద్దతివ్వొచ్చు. అంతేకాకుండా ఉగ్రవాద నిర్మూలన, వాతావారణ మార్పులు, ఆరోగ్యం, వాణిజ్యం తదితర రంగాల్లో రెండు దేశాలూ కలిసి ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ 2006లో చెప్పిన తన మాటను నిలబెట్టుకునే సమయం వచ్చింది. ఎలా అంటే.. 2006లో బైడెన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘2020 నాటికి ప్రపంచంలో అత్యంత సన్నిహిత దేశాలుగా భారత్, అమెరికా అవతరించాలి. అప్పుడే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. దానికి కార్యరూపం దాల్చే సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయన చెప్పినట్లు 2020 చివరినాటికి కాకపోయినా.. కనీసం 2021 నాటికైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడే అవకాశముంది. భారత్‌కు బైడెన్ కొత్తేమీ కాదు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అంతర్జాతీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్‌గా, ఉపాధ్యక్షుడి హోదాలు చాలా సార్లు అధికారిక చర్చలు జరిపారు.
భారత్, అమెరికా భాగస్వాములనే తన చిరకాల నమ్మకాన్ని ఉటంకిస్తూ బైడెన్ కొద్ది రోజుల్లో ప్రకటన విడుదల చేసే అవకాశముంది. అంతేకాకుండా ఇండియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి బైడెన్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని బైడెన్ ఇది వరకే ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు చెప్పారు. ‘‘భారత్- అమెరికా కలిసి పని చేయకపోతే ప్రపంచ సవాళ్లను అధిగమించలేం. దీనికోసం భారత్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉగ్రవాద చర్యల అణచివేత, ఆరోగ్య, వాణిజ్య తదితర రంగాల్లో అమెరికా మద్దతు కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలున్న అమెరికా, భారత్.. ప్రజాస్వామ్య విలువలను పంచుకుంటాయి’’ అని డెమొక్రాటిక్ పార్టీ తన పాలసీ పేపర్‌లో తెలిపింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతోపాటు ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న తాను కూడా భారత్‌తో సంబంధాల కోసం కృషి చేశానని ఆయన పలుమార్లు చెప్పారు. దీనిని బట్టి ఇప్పటితో పోల్చుకుంటే భారత్‌తో అమెరికా బంధం మరింత బలోపతం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.