అక్కడ క్రిస్‌మస్‌కు ముందే కొవిడ్ టీకా!

కరోనావైరస్ కట్టడికి పైజర్ టీకా సురక్షితమైందని తేలితే, క్రిస్‌మస్‌ కంటే ముందే దాన్ని అందుబాటులోకి తేవాలనుకుంటున్నామని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాకాంక్ అంచనావేశారు.

Published : 16 Nov 2020 18:27 IST

అంచనా వేస్తోన్న బ్రిటన్ ప్రభుత్వం

లండన్‌: కరోనావైరస్ కట్టడికి పైజర్ టీకా సురక్షితమైందని తేలితే, క్రిస్‌మస్‌ కంటే ముందే దాన్ని అందుబాటులోకి తేవాలనుకుంటున్నామని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాకాంక్ ప్రకటించారు. ‘మేం టీకాకు సంబంధించి సంస్థతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. అది అందుబాటులోకి రాగానే, పంపిణీకి సిద్ధంగా ఉన్నాం. డిసెంబర్‌ ఒకటినాటికే మేం సిద్ధంగా ఉంటాం. క్రిస్‌మస్‌ కంటే ముందే అందుబాటులోకి తెచ్చేందుకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అంటూ మంత్రి వెల్లడించారు. అలాగే, బ్రిటన్‌కు ఎన్ని టీకాలు అవసరమవుతాయని ప్రశ్నించగా..వ్యాప్తిని నివారించే సామర్థ్యంపై ఆ సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు. కాగా, తమ టీకా 90 శాతం ప్రభావంతో పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైందని పైజర్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా..పైజర్ సంస్థ నుంచి నాలుగు కోట్ల టీకా డోసులను కొనుగోలు చేసేందుకు బ్రిటన్‌ ఆర్డర్ ఇవ్వగా, ఏడాది చివరి నాటికి కోటి టీకా డోసులు అందుబాటులో ఉంటాయని ఆ దేశం భావిస్తోంది. అలాగే అక్కడి ప్రభుత్వం టీకాల కోసం పైజర్, ఆస్ట్రాజెనికా వంటి తదితర సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని