Sudhaa Chandran: సుధా చంద్రన్‌కు సీఐఎస్‌ఎఫ్‌ క్షమాపణ

 కృత్రిమ అవయవదారులకు మన దేశంలోని విమానాశ్రయాల్లో తీవ్ర అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రముఖ

Updated : 22 Oct 2021 17:01 IST

దిల్లీ: ప్రముఖ నర్తకి, నటి సుధా చంద్రన్‌కు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) క్షమాపణ చెప్పింది. విమానాశ్రయాల్లో తనలాంటి కృత్రిమ అవయవదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళుతూ ఆమె ఓ వీడియోను పోస్ట్‌ చేసిన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్‌ ఈ విధంగా స్పందించింది. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తమ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని పేర్కొంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..?

కృత్రిమ అవయవదారులకు మన దేశంలోని విమానాశ్రయాల్లో తీవ్ర అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుధా చంద్రన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేసి తనిఖీల పేరుతో అధికారుల నుంచి ఎదురయ్యే వేధింపులకు ముగింపు పలకాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను గురువారం ఆమె పోస్టు చేశారు. వృత్తి రీత్యా విమానాల్లో తరచూ ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. కృత్రిమ అవయవాల్లో పేలుడు పదార్థాల వంటివి తీసుకొస్తారనే అనుమానం ఉంటుంది గనుక సంబంధిత తనిఖీలు చేసుకోవడంలో అభ్యంతరం లేదన్నారు. అయితే, విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేపట్టే ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపించాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇది తనలాంటి వారికి ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు అయిన మహిళలకు ఎంతో ఇబ్బందికరమని సుధా చంద్రన్‌ ఆ వీడియోలో వివరించారు. సమస్యను ప్రధాన మంత్రితో పాటు కేంద్ర, రాష్ట్రాల అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వీడియోను పోస్టు చేస్తున్నట్లు తెలిపారు.

దీనిపై సీఐఎస్‌ఎఫ్‌ తాజాగా ట్విటర్‌ ద్వారా స్పందించింది. ‘సుధా చంద్రన్‌కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రోటోకాల్‌ ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రోస్తెటిక్స్‌ తొలగించాలని భద్రతా సిబ్బంది సూచించాలి. అయితే, అక్కడున్న (విమానాశ్రయంలో) మహిళా భద్రతా సిబ్బంది ఎందుకు అలా అడగాల్సి వచ్చిందో తెలుసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మా సిబ్బందికి మరోసారి అవగాహన కల్పిస్తామని సుధాచంద్రన్‌కు హామీ ఇస్తున్నాం’’ అని సీఐఎస్‌ఎఫ్‌ తన ట్వీట్‌లో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని