ఆగస్టు కల్లా 30 కోట్ల మందికి టీకా: హర్షవర్దన్‌

వచ్చే ఏడాది ఆగస్టు కల్లా దేశంలో 30 కోట్ల మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 30 Nov 2020 16:07 IST

దిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు కల్లా దేశంలో 30 కోట్ల మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది తొలి నాలుగు నెలల్లోపు దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆగస్టులోపు 30 కోట్ల మందికి వ్యాక్సిన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం తదితర నిబంధనలు విధిగా పాటించాలి. ప్రపచంలోనే భారత్‌లో అత్యధికంగా రికవరీ రేటు నమోదైంది. గత జనవరిలో మనవద్ద అందుబాటులో ఉన్న ప్రయోగ శాలల సంఖ్య ఒకటి.. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 2వేలకు పైగా చేరింది. ప్రతిరోజూ మిలియన్ల మంది పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు మనం 14 కోట్ల కరోనా వైరస్‌ పరీక్షలు పూర్తి చేశాం. దీన్ని బట్టి ప్రభుత్వం కరోనా వైరస్‌పై ఏవిధంగా విశ్రాంతి లేకుండా శ్రమిస్తుందనే విషయం చెప్పవచ్చు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ మాస్కులు, పీపీఈ కిట్ల ఉత్పత్తి విషయంలో స్వావలంబన దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ 10లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నాం. అంతేకాకుండా మన శాస్త్రవేత్తలు కూడా సరైన సమయానికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతర కృషి చేస్తున్నారు’ అని హర్షవర్దన్‌ తెలిపారు.

కాగా దేశంలో ఇప్పటి వరకు 94లక్షల కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38వేల కేసులు నమోదు కాగా.. 443 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4లక్షలకు పైగా ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,37,139కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని