Updated : 08/11/2020 15:24 IST

కరోనాపై బైడెన్‌ ప్లాన్‌ ఏమిటి?

 కరోనా టాస్క్‌ ఫోర్స్‌లో వివేక్‌ మూర్తి.. 

ఇంటర్నెట్‌డెస్క్‌ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి జో బైడెన్‌ వైపు మళ్లింది. కరోనావైరస్‌ కట్టడిలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని జో ఎన్నికల ప్రచారంలో పదేపదే ఆరోపించారు. గ్రేట్‌ డిప్రెషన్‌ తర్వాత తలెత్తిన మహా విపత్తు ఇదే అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన విజయం సాధించడంతో కరోనాను కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో కీలక నిర్ణయాల అమలుకు సెనెట్‌ ఆమోదం తప్పని సరి. ఇప్పుడు సెనెట్లో రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అంతేకాదు ట్రంప్‌ కంటే భిన్నంగా చేయడం కూడా బైడెన్‌కు సవాలుగా మారనుంది. ట్రంప్‌ ఇప్పటికే టీకా అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించారు. దీంతో రెండు ప్యాకేజీలను ప్రకటించారు. మరో ప్యాకేజీపై కూడా త్వరలో సంతకం చేస్తానని చెప్పారు.

మహమ్మారి కట్టడికి బైడెన్‌ వద్ద ఉన్న ప్రణాళిక అమలు చేయాలయంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ వంటివి రాష్ట్రాల నుంచి ఫెడరల్‌ ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం సవాలుతో కూడుకున్న పని. శుక్రవారం ఒక్క రోజే అమెరికాలో 1,28,000 కరోనాకేసులు కొత్తగా వచ్చాయి. దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి  2.40లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

శీతాకాలం వచ్చే కొద్దీ అక్కడ కేసుల సంఖ్య పెరగటంతోపాటు.. మరణాలు కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరిలో గానీ, ఆ తర్వాతగానీ కరోనా వైరస్‌ అత్యంత తీవ్రమైన దశను అమెరికా చవిచూస్తుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌ సంస్థ హెచ్చరించింది. ట్రంప్‌ వచ్చే రెండు నెలల్లో సమర్థవంతమైన చర్యలు చేపట్టకపోతే వైరస్‌ వ్యాప్తి కొండలా పెరిగిపోతుంది.

బైడెన్‌ కరోనావైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ను సోమవారం  ప్రకటించే అవకాశం ఉంది. వైరస్‌ కట్టడి తన తొలిప్రాధాన్యమని ప్రజలకు సందేశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు భారత మూలాలున్న వివేక్‌ హెచ్‌ మూర్తిని సహ అధ్యక్షుడిగా నియమించవచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు మాస్కులు, భౌతిక దూరాన్ని తప్పని సరి చేయాలని రిపబ్లికన్లను, డెమొక్రాటిక్‌ పార్టీ గవర్నర్లను కోరవచ్చని బైడెన్‌ సహాయకులు చెబుతున్నారు.

బైడెన్‌కు అనుభమే కలిసొస్తుంది..

బైడెన్‌ తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం వివిధ రాజకీయ అంశాలపై రిపబ్లికన్లను, డెమొక్రాట్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశారు. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంత మంది బైడెన్‌-కమలాకు మద్దతు తెలిపి.. వీరి ప్రణాళికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దేశంలో వచ్చిన రాజకీయ చీలికను అర్థం చేసుకొని రిపబ్లికన్లను కూడా ఒప్పించడం బైడెన్‌కు కత్తిమీద సాములాంటింది. రానున్న మూడు నెలల్లో ఆయన అదే పనిలో ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘మాస్క్‌ ధరించడం అనేది దేశానికి సేవచేయడంతో సమానంగా బైడెన్‌ భావిస్తారు. వచ్చిన మొదటి రోజు నుంచి ఈ దిశగా చర్యలు తీసుకొవడం ప్రారంభిస్తారు’’ అని బైడెన్‌ అధికార ప్రతినిధి జమాల్‌ బ్రౌన్‌ తెలిపారు.

అంతేకాదు బైడెన్‌ శుక్రవారం  రాత్రి ప్రసంగిస్తూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కూడా తన ప్రాధాన్యాల్లో ఒకటని వెల్లడించారు. ‘‘మీ అందరికి ఒక విషయం తెలియాలని నేను కోరుకుంటున్నాను. నేను అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి రంగంలోకి దిగుతాను. మనం చనిపోయిన వారి ప్రాణాలను తీసుకురాలేం. కానీ, రానున్న నెలల్లో ప్రాణాలు పోకుండా కాపాడుకుంటాం’’ అని పేర్కొన్నారు.

‘‘సోమవారం నేను శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాను. వారు బైడెన్‌-హారిస్‌ కొవిడ్‌ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లెందుకు అవసరమైన బ్లూప్రింట్‌ సిద్ధం చేస్తారు. ఆ ప్లాను వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు. 

ఎవరీ వివేక్‌ మూర్తి..

బైడెన్‌ నియమించే కరోనా టాస్క్‌ ఫోర్స్‌కు సహాధ్యక్షత వహిస్తారని భావిస్తున్న 45ఏళ్ల వివేక్‌ మూర్తి అమెరికాలో మంచి పేరున్న వైద్యుడు. ఆయన ఒబామా, ట్రంప్‌ పాలన సమయంలో దేశానికి సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కమిషన్‌ కోర్‌కు వైస్‌ అడ్మిరల్‌ హోదాలో విధులు నిర్వహించారు. డాక్టర్స్‌ ఫర్‌ అమెరికా సంస్థను  స్థాపించారు. కర్ణాటక నుంచి యూకేకు వలస వచ్చింది మూర్తి కుటుంబం. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడింది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, యేల్‌ విశ్వవిద్యాలయాల్లో మూర్తి చదివారు. కొన్ని నెలలుగా ఆయన బైడెన్‌కు కరోనాపై మార్గదర్శకత్వం చేస్తున్నారు. మేలో బైడెన్‌ ప్రచార బృందం ఏర్పాటు చేసిన హెల్త్‌ టాస్క్‌ ఫోర్స్‌కు కాంగ్రెస్‌ మహిళ ప్రమిలా జయపాల్‌తో కలిసి నేతృత్వం వహించారు. ఆ సమయంలో బైడెన్‌ గురించి మూర్తి మాట్లాడుతూ.. ‘‘బైడెన్‌ను మా ఇంటికి భోజనానికి పిలిచి.. మా అమ్మ, నాన్నతో కలిసి డిన్నర్‌ చేయాలనుకుంటున్నాను. ఆయన చాలా మంచివారు. ఆయన ఆలోచన తీరు నన్ను ఆకట్టుకొంది’’ అని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని