శీతాకాలంలో కరోనా: ఈ భౌతిక దూరం సరిపోదా?

శీతాకాలంలో మాత్రం ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.

Published : 15 Oct 2020 17:44 IST

శ్వాసకోశ బిందువులతో తీవ్ర ప్రభావం: శాస్త్రవేత్తలు

లాస్‌ ఏంజలిస్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ఇప్పటికే కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే, శీతాకాలంలో మాత్రం ఈ భౌతిక దూరం సరిపోకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో నోటి నుంచి వెలువడే తుంపరలు ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

గత డిసెంబరులో మొదలైన వైరస్‌ విజృంభణ అనతికాలంలోనే ప్రపంచం మొత్తం వ్యాపించింది. అంతేకాకుండా వేసవి కాలంలోనూ దీని ఉద్ధృతి కొనసాగింది. ముఖ్యంగా వేడి వాతావరణం ఉన్నప్పటికీ మూసివున్న ప్రాంతాల్లో గాలిలో ఆ కణాలు ఎక్కువదూరం ప్రయాణిస్తూ వైరస్‌ వ్యాప్తికి కారణమైనట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. అయితే, శీతాకాలంలో వైరస్‌ సోకిన వ్యక్తి శ్వాస నుంచి వెలువడే తుంపరలు నేరుగా ఎదుటివారిని చేరడం వల్ల ఇది మరింత ఎక్కువగా విజృంభించే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రస్తుతం పాటిస్తోన్న భౌతిక దూరం నిబంధన సరిపోదని స్పష్టంచేస్తున్నారు. దీనిపై జరిగిన తాజా పరిశోధన నివేదిక నానో లెటర్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా, సీడీసీ నిర్దేశించిన ఆరు అడుగుల కన్నా ఎక్కువ దూరం శ్వాసకోశ బిందువులు ప్రయాణిస్తున్నట్లు మేము చాలా సందర్భాల్లో గుర్తించామని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన యాన్‌యింగ్‌ ఝూ పేర్కొన్నారు. ‘అతి తక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువ తేమ ఉండే కూలర్లు, రీఫ్రిజిరేటర్లు ఉపయోగించే ప్రదేశాల్లో వైరస్‌ ఆరు మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి, భూమిపై పడుతున్నట్లు గుర్తించాం. మిగతా వాతావరణంతో పోలిస్తే అలాంటి ప్రదేశాల్లో వైరస్ ఒకరోజుకంటే ఎక్కువ సేపు సజీవంగా ఉంటుంది. మాంసాహార శుద్ధి కేంద్రాలు సూపర్‌ స్ప్రెడర్‌ సెంటర్లుగా మారడానికి ఇదే కారణమనే తేల్చాము’ అని యాన్‌యింగ్‌ ఝూ స్పష్టంచేశారు. ఈ కారణాల వల్ల వేసవితో పోలిస్తే శీతాకాలంలో వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అన్నారు. అందుకే, చల్లని, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో భౌతిక దూరం అధికంగా పాటించడంతోపాటు మేలిరకమైన మాస్కులు, ఎయిర్‌ ఫిల్టర్లవంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని